ప్రతి ఒక్కరికీ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరికీ అభినందనలు

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

ప్రతి ఒక్కరికీ అభినందనలు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన యోగాంధ్రకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

కై కలూరు: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేసినందుకు ప్రతి కార్యకర్త, నాయకులకు అభినందనలు తెలుపుతున్నానని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌) శుక్రవారం చెప్పారు. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, నియోజకవర్గ ఇన్‌చార్జులు మామిళ్ళపల్లి జయప్రకాష్‌, పుప్పాల వాసుబాబు తెల్లం బాలరాజు, కంభం విజయరాజు, మేకా ప్రతాప్‌ అప్పారావులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. కార్యకర్తలు, ప్రజల్లో వచ్చిన స్పందన రానున్న ప్రజా ఉద్యమ కార్యక్రమాలకు నాంది పలుకుతుందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆశిస్తున్నట్టు డీఎన్నార్‌ పేర్కొన్నారు.

ఏలూరు(టూటౌన్‌): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి చెప్పారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ లో శుక్రవారం ముద్రించిన పోస్టర్‌ను కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ సమాజానికి శాపమని, దీనిని పూర్తిగా నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మిక నిర్మూలన కోసం జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి చెందిన అన్ని శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఉప కార్మిక కమిషనర్‌ పి. శ్రీనివాస్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ నాగేశ్వరరావు, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శారద, సహాయ కార్మిక కమిషనర్‌ జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌. శ్రీలక్ష్మీ అధ్యక్షతన, డిప్యూటి కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, క్రాఫ్‌ స్వచ్ఛంద సంస్థ సంయుక్తముగా శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పారా లీగల్‌ వాలంటీర్లు, పౌరులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌. శ్రీలక్ష్మీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ప్రతి సంవత్సరం జూన్‌ 12న ఈ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారుఏ. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పి.శ్రీనివాస్‌, డీసీపీఓ సీహెచ్‌ సూర్య చక్రవేణి, సీడబ్ల్యూసీ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌ పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): ఈ నెల 19న పట్టిసీమలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జె. అభిషేక్‌ గౌడ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం పట్టిసీమలో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పట్టిసీమలో ఈనెల 19న పెద్ద ఎత్తున యోగాభ్యాసన కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, అందుకు అనుగుణంగా కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా కార్యక్రమం ఉదయమే ప్రారంభమయ్యేలా చూడాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నీడ ప్రదేశంలో ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో అధికారులు, సిబ్బంది అందరూ యోగాంధ్ర యాప్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులను యోగాంధ్ర కార్యక్రమంలో నమోదు చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈఓ జగదాంబ, డీపీఓ మల్లికార్జునరావు, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు అధికారి జి.వెంకటనాయుడు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement