బుట్టాయగూడెం: మారుమూల గ్రామమైన పులిరాముడుగూడెంలో పాఠశాల పునఃప్రారంభం రోజున ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ పాఠశాల గేట్లకు గ్రామస్తులు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు తాళాలు వేసి బైఠాయించారు. మా పాఠశాల మాకే కావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి గిరిజన విద్యా విధానంలో ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో.. పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కేవలం 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకూ మాత్రమే విద్యాబోధనను పరిమితం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గ్రామస్తులు, విద్యార్థి, గిరిజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కలెక్టర్ స్వయంగా వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకూ పాఠశాల తెరిచేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న కేఆర్‌పురం ఐటీడీఏ డీడీ పి.జనార్దన్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, తమ నిరసనను విరమించేందుకు నిరాకరించారు. న్యాయవాది యేసుబాబు, పీడీఎస్‌యూ నాయకులు భూషణం, బన్నే వినోద్, గిరిజన సంఘం నాయకుడు తెల్లం రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. గతంలో 3 నుంచి 10వ తరగతి వరకూ తరగతులు నిర్వహించేవారని గుర్తుచేశారు. పులిరాముడుగూడెం పరిధిలో దాదాపు 12 కొండరెడ్డి గిరిజన గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల పిల్లలకు ఇక్కడ చదువుకునేందుకు ఎంతో సౌకర్యంగా ఉండేదని చెప్పారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మడి శ్రీరాములు, ఎంపీటీసీ మడకం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పులిరాముడుగూడెం ఆశ్రమ పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన


