ఏలూరు టౌన్: అన్యాయానికి గురైన బాధితులకు అండగా నిలుస్తూ భరోసా కల్పించే బాధ్యత పోలీస్, న్యాయవ్యవస్థలు తీసుకుని విజయవంతంగా నేరస్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ చెప్పారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ డీసీఎంఎస్ కళ్యాణమండపంలో జిల్లాలోని బాధితులతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధులుగా ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ హాజరయ్యారు. జిల్లాలో ఆయా కేసుల్లో న్యాయం పొందిన బాధితులతో మమేకం అవుతూ వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 62 కేసుల్లో ఏకంగా 74 మంది నేరస్తులకు శిక్షలు విధించేలా పోలీస్, న్యాయవ్యవస్థ సమన్వయంతో చేసిన కృషిని అభినందించారు. జిల్లాలో కోర్టు మానిటరింగ్ సెల్ కృషి, సేవలపై బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఐజీ మాట్లాడుతూ.. సీఎంసీ ఏర్పాటుతో సత్ఫలితాలు సాధించామని చెప్పారు. ఎస్పీ శివకిషోర్ ప్రత్యేక శ్రద్ద, సీఎంసీ ప్రత్యేక అధికారి నిబద్ధతతో పనిచేయటం, సిబ్బంది సేవలతో బాధితులకు న్యాయం అందించే అవకాశం ఏర్పడిందన్నారు. నేరస్తులకు కఠిన శిక్షలు విధించేలా చేయడమే పోలీసు ప్రధాన బాధ్యత అన్నారు. ఏలూరు రేంజ్‌లో 5 జిల్లాల్లో సీఎంసీ ఏర్పాటు చేశామని, మంచి ఫలితాలు వస్తున్నాయని ఐజీ చెప్పారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ.. జిల్లాలో కోర్టు మానిటరింగ్ సెల్ అద్భుత ఫలితాలు రాబట్టిందని.. ఇదే స్పూర్తితో భవిష్యత్‌లోనూ నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పీ.ఆనంద జ్యోతి, అదనపు పీపీలు చింతమనేని రమేష్, ఎం.కేదారి, ఐ.రాజశేఖర్, స్పెషల్ పీపీలు ఎన్.శారదాని, వీ.అమర్ శ్రీనివాస్, ఓగిరెడ్డి వెంకన్నబాబు హాజరయ్యారు.
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్


