● కానరాని విద్యార్థి మిత్ర కిట్లు
● యూనిఫామ్, బూట్లు లేకుండానే తరగతులకు విద్యార్థులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయాయ్యయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా పునఃప్రారంభ తేదీని పొడిగించాలని ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరినా ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా శుక్రవారమే పాఠశాలలను ప్రారంభించింది. అయితే తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం సుమారు 50 శాతానికి మాత్రమే పరిమితమైంది. తొలిరోజు తరగతులకు హాజరైన విద్యార్థులకు మాత్రం సమస్యలు స్వాగతం పలికాయి.
బూజు పట్టిన గదులు.. దుమ్ము పట్టిన బెంచీలు
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు తరగతి గదులు బూజుపట్టి దర్శనమిచ్చాయి. అలాగే వారు కూర్చునే బెంచీలు దుమ్ముతో నిండిపోయాయి. తరగతి గదులను శుభ్రం చేసి విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని ఆదేశించినా సమస్యలే స్వాగతం పలికాయి. పునఃప్రారంభ తేదీని వాయిదా వేస్తారనే ప్రచారం జరగడంతో మరో మూడు రోజులు గడువు ఉంటుందనే ఆలోచనతో చాలా పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేయలేదని తెలుస్తోంది. పాఠశాలలోకి అడుగుపెట్టిన వెంటనే ఇటీవల కురిసిన వర్షానికి నీటితో నిండి బురదమయంగా మారిన ప్రాంగణాలు విద్యార్థులకు తొలిరోజే పరీక్ష పెట్టాయి.
యూనిఫామ్, బూట్లు నిల్
ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే సౌకర్యాలను నిర్లక్ష్యం చేస్తోంది. దీనిలో భాగంగానే పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు యూనిఫరం, బూట్లు, సాక్సులు, టైలు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీలు అందించాల్సి ఉండగా కేవలం పుస్తకాలను మాత్రమే సరఫరా చేసింది. దీనితో విద్యార్థులు గత ఏడాది వినియోగించిన యూనిఫారమే వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. గత ఏడాది నాణ్యతలేని యూనిఫారం అందించడంతో గత విద్యా సంవత్సరం చివరి వరకూ కూడా యూనిఫారం ఉపయోగపడకపోవడంతో కొంతమంది చిరిగిన యూనిఫారమే వేసుకువచ్చారు. ఈ ఏడాది కొత్త యూనిఫారం సరఫరా చేయకపోవడంతో ఆ చిరిగిన యూనిఫారాన్నే కుట్లు వేసుకుని ధరించాల్సి వచ్చింది. అలాగే గత ఏడాది పంపిణీ చేసిన బూట్లు కూడా నాణ్యత లేక విద్యా సంవత్సరం మధ్యలోనే పాడైపోవడంతో చెప్పులు వేసుకువచ్చిన వారు ఈ ఏడాది కొత్త బూట్లు వస్తాయని ఎదురు చూడగా వారికి నిరాశే ఎదురయింది. అనేక మంది చిరిగిన స్కూల్ బ్యాగులు ధరించి రాగా మరికొంతమంది ఇంటిలో ఉన్న చేతి సంచుల్లో పుస్తకాలు తెచ్చుకోవడం కనిపించింది.
తొలిరోజు 126085 మంది హాజరు
జిల్లాలో తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం అత్యంత స్వల్పంగానే నమోదయింది. జిల్లాలో మొత్తం 239524 మంది విద్యార్థులుండగా వారిలో తొలిరోజు కేవలం 126085 మంది మాత్రమే హాజరు కావడం విద్యాశాఖాధికారులకు మింగుడు పడలేదు. విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధింత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ముందు నుంచీ సమాచారం అందిస్తున్నా పాఠశాలలకు రావడానికి వారు పెద్దగా ఆసక్తి చూపలేదు అయితే శుక్రవారం పాఠశాలలు తెరిస్తే మరుసటి రోజే రెండో శనివారం వస్తుందని, రెండవ శనివారం పాఠశాలలకు సెలవు ఉంటుందని, దీనితో రెండో రోజు పాఠశాలలకు వెళ్ళే అవకాశం ఉండదనే కారణంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపలేదని తెలుస్తోంది.


