ద్వారకాతిరుమల: మట్టి మేతగాళ్లు నిబంధనలకు నిలువునా పాతరేస్తున్నారు. రాత్రింబవళ్లూ కాలువ గట్లపై పొక్లెయిన్, జేసీబీలతో అక్రమ తవ్వకాలు సాగిస్తూ గట్లను మాయం చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలంలోని పోలవరం కుడి కాలువ గట్లు అక్రమ తవ్వకాలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. భీమడోలు–ద్వారకాతిరుమల ప్రధాన రహదారిలోని పంగిడిగూడెం వద్ద రోడ్డు పక్కన గత రెండు రోజులుగా పోలవరం కుడి కాలువ గట్టుపై మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ మట్టి దందాను సాగిస్తున్నారు. కళ్ల ముందే జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు.
ట్రక్కు మట్టి రూ. 800
రోజుకు వంద ట్రాక్టర్ ట్రక్కుల మట్టిని తవ్వేస్తున్నారు. ఒక్కో ట్రక్కు మట్టిని రూ. 800 లకు విక్రయిస్తున్నారు. గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాలకు ఈ మట్టిని తరలిస్తున్నారు. అయితే కాలువ గట్టుపై ఉన్న మట్టినే కాకుండా, గట్టుపై గుంతలు పెట్టి మరీ గ్రావెల్‌ను ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ దోపిడీ సాగుతూనే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై తహసీల్దార్ జేవీ సుబ్బారావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఇష్టానుసారంగా చేపల చెరువుల తవ్వకాలు
భీమడోలు: నిబంధనలు బేఖాతరు చేస్తూ గుండుగొలను ప్రాంతంలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు యధేచ్చగా సాగుతున్నాయి. ఆక్వా జోన్ పుణ్యమా వరి పొలాలు సైతం చేపల చెరువులుగా మారిపోతున్నాయి. గుండుగొలనులోని కొరుకల్లు రోడ్డు వెంబడి 120 ఏకరాల విస్తీర్ణంలో పంట పొలాలను చేపల చెరువులుగా మార్చేశారు. రత్నాపురానికి వెళ్లే దారిలో గుండుగొలను రెవెన్యూ పరిధిలోని బీసీ కాలనీని ఆనుకున్న సర్వే నెంబర్ 107/20, 106/2, 109, 109/1ఏ లోని 12.09 ఏకరాల విస్తీర్ణంలోని పంట పొలాలను శుక్రవారం జేసీబీల సాయంతో తవ్వుతున్నారు. తవ్వగా వచ్చే మట్టితో మురుగు డ్రైయిన్‌ను పూడ్చేస్తున్నారు. 2021లో సంబంధిత పొలం యాజమానులు పర్మిషన్ పొందినా అప్పట్లో రైతులు ఆక్వా చెరువులు తవ్వితే మా పంట దెబ్బతింటుందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ పర్మిషన్లును రద్దు చేశారు. ఆ పర్మిషన్ పత్రాలను బూచీగా చూపుతూ సంబంధిత రైతులు తమ రాజకీయ పలుకుబడిని వినియోగించుకుంటూ అక్రమంగా చెరువును జేసీబీల సాయంతో తవ్వేస్తున్నారు. తవ్వకాల గురించి కొంతమంది రైతులు భీమడోలు ఎఫ్‌డీవో దుర్గాభవానికి ఫిర్యాదు చేశారు. ఎఫ్‌డీవో ఆదేశాల మేరకు గుండుగొలనులోని గ్రామస్థాయి మత్స్యశాఖ సహాయకుడు, వీఆర్వోలు సంఘటన స్థలానికి వెళ్లి ఆ పనులు అడ్డుకున్నారు. పొలం యాజమానులకు నోటీసులు జారీ చేశారు. జేసీబీలను అక్కడ నుంచి పంపించి వేశారు.
రెచ్చిపోతున్న మట్టి మాఫియా


