యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు

తహసీల్దార్‌ ఆదేశాలతో నిలిపివేశాం

చెరుకువాడలో అక్రమార్కుల ఇష్టారాజ్యం

అధికారుల ఆదేశాలు బేఖాతరు

ఉండి : శ్రీఅంతా మా ఇష్టం.. మమ్మల్ని ఆపేదెవ్వరు?్ఙ అన్నట్లుగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతోంది. పెద్ద ఎత్తున లారీలు, ట్రాక్టర్లు, బుల్‌డోజర్ల సహాయంతో ప్రభుత్వ భూములు, పుంతలు, చివరకు వరి పొలాలను సైతం తవ్వేస్తూ మట్టిని ప్రైవేట్‌ లేఅవుట్లకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ధ్వంసమవుతున్న రహదారులు

భారీ వాహనాలతో నిరంతరం మట్టిని రవాణా చేస్తుండటంతో గ్రామీణ రోడ్లు, పుంతలు, కాలువ గట్లతో పాటు చివరకు 165 జాతీయ రహదారి కూడా పూర్తిగా అధ్వానంగా తయారైంది. తమ రవాణా సౌకర్యం కోసం కాలువలు, పంట బోదెలు, డ్రెయిన్లపై అక్రమంగా వంతెనలు నిర్మిస్తున్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ రవాణాపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదేశాలు ఇచ్చినా ఆగని తవ్వకాలు

చెరుకువాడలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం ఉదయం వీఆర్వో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. ఎటువంటి అనుమతులు లేనందున తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. అయితే, అధికారులు వెళ్లిన కాసేపటికే మాఫియా మళ్లీ తవ్వకాలను ప్రారంభించింది. అధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా మట్టి మాఫియా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

తహసీల్దార్‌ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం చెరుకువాడలో మట్టి తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించాను. అయితే కార్యాలయంలో సమావేశం ఉండడంతో నేను వెళ్లి వచ్చేసరికి మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. దీనిపై సమాచారం అందడంతో సాయంత్రం మళ్లీ క్షేత్రస్థాయికి వెళ్లి లారీలను, తవ్వకాలను నిలిపివేయించాను. ఇకపై ఇక్కడ అక్రమ తవ్వకాలు జరగకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటాం. – గొల్లమ్మ, వీఆర్వో, చెరుకువాడ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement