తణుకు అర్బన్ : తెలుగు తెరపై వినూత్న కథతో కుంభ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు కథానాయకుడు, దర్శకుడు జై సాయి వెంకట్ అన్నారు. తణుకు కరుటూరి నగర్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుంభ యూనిట్ ఆధ్వర్యంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తణుకు, పాలకొల్లు, నర్సాపురం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్న ఈ కుంభ సినిమా సస్పెన్స్ హర్రర్, పూర్తి కామెడీతో వినోద భరితంగా చిత్రీకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. అధికశాతం షూటింగ్ తణుకు పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ నిర్వహించామని, వచ్చే ఏడాది చిత్రం విడుదల చేసే విధంగా వేగంగా షూటింగ్ ప్రక్రియ జరుపుతున్నామని వివరించారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై హింసకు గురైన బాధితులకు తక్షణ, సమగ్ర సహాయం అందించేందుకు వన్ స్టాప్ సెంటర్‌కు ప్రత్యేక వాహనాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి బుధవారం కలెక్టరేట్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మిషన్ శక్తి – సంబల్ పథకం మార్గదర్శకాల మేరకు ఈ వాహనం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి.శారద, నోడల్ అధికారి, డీఎంసీ ఇ.తులసి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సీహెచ్. నిర్మల తదితరులు పాల్గొన్నారు.
13 మందికి గాయాలు
పాలకొల్లు సెంట్రల్: వివాహ వేడుకకు వెళ్తుండగా పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం కరుగోరుమిల్లు గ్రామం నుంచిబుధవారం పెనుమదంలో జరిగే వివాహ వేడుకకు కొందరు వ్యాన్‌లో బయలుదేరారు. మార్గమధ్యంలో వద్దిపర్రు వద్దకు వచ్చేసరికి వ్యాన్ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి చేయి విరగడంతో మెరుగైన వైద్యం కోసం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధురి తెలిపారు. మిగిలిన 12 మందికి స్వల్ప గాయాలు కావడంతో పాలకొల్లులోనే ప్రాథమిక చికిత్స అందించినట్లు ఆమె పేర్కొన్నారు.
దెందులూరు: ఏలూరు రూరల్ మండలం ఆటోనగర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏలూరు రోడ్డు పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు వివరించారు.
చాట్రాయి: నాటుసారా తయారు చేసిన పాత నేరస్తులను బైండోవరు చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ సీస్తానరావు తెలిపారు.బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాటు సారా తయారీ, అమ్మకందారులపై నెల క్రితం దాడి చేసినప్పుడు నేర స్థలం నుంచి పారిపోయిన వారిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవరు చేసినట్లు ఆయన చెప్పారు.
జంగారెడ్డిగూడెం: బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయంపై సమగ్ర విచారణ చేసి బ్యాంకు మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ కుటుంబ అవసరాల నిమిత్తం బంగారం కుదువ పెట్టి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రుణం తీసుకుంటే, బంగారాన్ని మాయం చేసిన ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. బ్యాంకు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని ఖాతాదారులకు ధైర్యం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.


