● నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
● తెగుళ్లు దూరం, అదుపులో సాగు ఖర్చులు
ముసునూరు: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కాస్త ముందుగా ప్రారంభం కానున్న దశలో వరి పంట విత్తన ఎంపికలో జాగ్రత్త వహించాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. నకిలీ విత్తనాలను ఎంపిక చేసుకుంటే, పంట దిగు బడులు రాక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. రైతుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విత్తన దుకాణాదారులు నకిలీ విత్తనాలను విక్రయించే అవకాశం ఉంది. వీటిని సాగుచేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్త వహించాలని, నాణ్యమైన విత్తనాలను మాత్రమే విత్తుకోవాలని సూచిస్తున్నారు. రైతులు విత్తనాల ఎంపిక, కొనుగోలు విషయంలో జాగ్రత్తపడాలని వివరిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని పేర్కొంటున్నారు. నాసిరకం, నకిలీ విత్తనాలు విక్రయించే షాపులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టి, కేసులు నమోదు చేయాలి.
విత్తనాల ఎంపిక ఇలా
● విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తతతో వ్యవహరించాలి. నాణ్యత ఉన్న విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.
● విత్తనాలన్నీ ఒకే పరిమాణంలో ఉండే విధంగా ఎంపిక చేసుకుంటే పంట పెరుగుదల సమంగా ఉండి ఒకేసారి కోతకు వస్తుంది.
● తెగులు సోకని విత్తనాలను ఎంపిక చేసుకుంటే ఆరోగ్యకరమైన పంట పెరుగుదలకు దోహదపడుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది.
● పురుగు పట్టని విత్తనాలను ఎంపిక చేసుకుంటే నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంట చేతికి అందుతుంది.
● భౌతిక స్వచ్ఛత ఉన్న విత్తనాలను ఎంపిక చేసుకుంటే స్వచ్ఛమైన విత్తనాల స్థాయి తెలుస్తుంది.
● పంట ఎదుగుదల, దిగుబడిలో పెరుగుదల ఉంటుంది. జన్యు స్వచ్ఛత ఉన్న విత్తనాలను ఎంపిక చేసుకుంటే పోషకాల లోపం నివారణలో మంచి పంట లభిస్తుంది.
● ముందుగా శాంపిల్స్ ను తీసుకుని, వాటిని నాన బెట్టడం ద్వారా మొలకెత్తే స్థాయిని అవగాహన చేసుకోవాలి.
రైతులు విత్తనాలు విత్తుకునే ముందే తగిన జాగ్రత్తతో నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ప్రతి దానికి బిల్లు తీసుకోవాలి.
– ఆలూరు చాముండేశ్వరి, మండల వ్యవసాయ శాఖాధికారి, ముసునూరు


