ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం సమీపంలోని దేవీబార్ వద్ద మందుతాగి బయటకు వచ్చిన ఒక యువకుడిని మోటారు సైకిల్‌పై తీసుకువెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి చంపుతామని బెదిరించి బంగారు ఆభరణాలు కాజేసిన ఇద్దరు నిందితులను ఏలూరు టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఉన్నారు. వివరాలు వెల్లడించారు. ఏలూరు శాంతినగర్ 3వ లైన్ ప్రాంతానికి చెందిన పర్వతనేని సాయి నవీన్ కండ్రికగూడెం సమీపంలోని దేవీబార్‌కు ఈనెల 7న రాత్రి 7 గంటలకు మద్యం తాగేందుకు వెళ్ళాడు. అనంతరం రాత్రి 10గంటలకు దేవీబార్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నిలబడగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి ఇంటివద్ద దించుతామని తీసుకువెళ్ళారు. కండ్రికగూడెం సెంటర్ దాటిన అనంతరం మోటారు సైకిల్‌పై ఉన్న వ్యక్తి నవీన్‌ను అరవకుండా నోరునొక్కి చొదిమెళ్ళ కోల్ల ఫారం వద్దకు తీసుకువెళ్లారు. ఆయిల్ పామ్ తీసుకువెళ్లి మోటారు సైకిల్ నుంచి దించి ఒక వ్యక్తి చేతులు పట్టుకోగా మరోవ్యక్తి గొంతు నులిమి చంపుతానని బెదిరించాడు. నవీన్ వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ కాజేసి ఉడాయించారు. బాధితుడు నవీన్ ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్సై రామకృష్ణకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో పెదవేగి మండలం వంగూరు గ్రామానికి చెందిన కొట్టే రాకేష్, కొండవల్లి అభిలాష్ అనే ఇద్దరిని ఈనెల 10న గుర్తించి కండ్రికగూడెం సెంటర్‌లో అరెస్ట్ చేశారు. ఇద్దరి వద్ద నుంచి బంగారు చైన్, బంగారు బ్రాస్‌లెట్, రెండు బంగారు ఉంగరాలు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన సీఐ అశోక్‌కుమార్, ఎస్సై రామకృష్ణ, ఏఎస్‌ఐ బంగారు ఏసు, కానిస్టేబుల్ ఇషాక్, శేఖర్ ఎస్పీ అభినందించారు.


