పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

కొయ్యలగూడెం : వర్జీనియా పొగాకు కొనుగోలుకు పొగాకు బోర్డు నిధుల నుంచి రూ.1000 కోట్లు కేటాయించి, రైతులు వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని, కిలో వర్జీనియా పొగాకుకు సరాసరి ధర రూ.380 ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని త్రినాథపురంలో వర్జీనియా పొగాకు రైతుల సమావేశం నిర్వహించారు. పొగాకు రైతుల సమస్యలపై చర్చించి గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టాలని తీర్మానించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కంపెనీలు, బోర్డు అధికారులకు కుమ్మకై ్క పొగాకు రైతులకు పొగ పెడుతున్నారని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ఎకరాకు మూడు లక్షల 70 వేల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారని, పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేదన్నారు. కొనుగోళ్లు మందకొడిగా జరిగితే రైతుల నష్టాలు మరింత పెరుగుతాయన్నారు. పొగాకు బోర్డు ముట్టడి కార్యక్రమం సందర్భంగా బోర్డు చైర్మన్‌ ఇచ్చిన హామీ ప్రకారం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు శుక్లబోయిన రాంబాబు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకుడు ఆత్కూరి వీర్రాజు, రైతులు యాగంటి కృష్ణ, తిరుమలశెట్టి శ్రీనివాస్‌, బసిరెడ్డి కేదారేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement