భర్త నుంచి రక్షణ కల్పించాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

భర్త నుంచి రక్షణ కల్పించాలని నిరసన

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

లింగపాలెం: భర్త నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ధర్మాజీగూడెంకు చెందిన పఠాన్‌ సల్మా పర్వీన్‌ వేడుకుంటోంది. మంగళవారం ఆమె తన ఇంటి ముందే ఇద్దరు పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి సల్మాపర్వీన్‌, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పఠాన్‌ సల్మా పర్వీన్‌కు, మాబు సుభానికి 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పెళ్లయిన కొన్నేళ్ల తరువాత నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. పెద్దల్లో, పోలీస్‌స్టేషన్‌లో పలు మార్లు కౌన్సెలింగ్‌ జరిగింది. అయినప్పటికీ వీరి మధ్య సమస్య పరిష్కారం కాకపోవడంతో పర్వీన్‌ కోర్టును ఆశ్రయించింది. కోర్టు పర్వీన్‌కు భరణం కింద రూ.10 లక్షలు, ప్రతి నెలా రూ.10 వేలు ఇవ్వాలని తీర్పునిచ్చింది. దీనిని తప్పించుకునేందుకు పర్వీన్‌ను ఒప్పించి మళ్లీ ఇంటికి తీసుకువెళ్లాడు సుభాని. అయితే కొన్ని నెలలు బాగా చూసుకున్న తరువాత నుంచి యధావిధిగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పర్వీన్‌ను కొట్టి చంపేందుకు యత్నించగా, సుభానిని కుమారులు అడ్డుకున్నారు. దీంతో వారిని ఇంటి నుంచి బయటకు గెంటి ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయాడు. దీంతో ఇంటిలో తనకు ఆశ్రయం కల్పించాలని, భర్త నుంచి తనను, తన పిల్లలను రక్షించాలని పోలీసు అధికారులను కోరుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement