మహిళలు, చిన్నారులపై నేరాలు సహించం
ఏలూరు టౌన్: ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నేరాలను నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని.. నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ చెప్పారు. సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన ఏలూరు, భీమడోలు, నిడమర్రు, కై కలూరు సీఐలు, ఎస్సైలతో నెల వారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేసుల పురోగతి, చార్జిషీట్ దాఖలు, కోర్టుల్లో సాక్షులను ప్రవేశపెట్టడం, నేరాలకు పాల్పడిన నిందితుల అరెస్టులపై పూర్తిస్థాయిలో ఆరా తీశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ అధికారులు వెంటనే స్పందించాలని, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోక్సో, గంజాయి, మత్తుపదార్థాల కేసుల విచారణ వేగవంతం చేయాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు, రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్లు తెరవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై శ్రద్ద వహించాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాల నిఘాను ఏర్పాటు చేయాలని, రద్దీ ప్రాంతాలు, వ్యాపార దుకాణాల్లో సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.


