కొల్లేరు హద్దుల నిర్ధారణను 20 రోజుల్లో పూర్తి చేయాలి
జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ
ఏలూరు(మెట్రో) : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాత మ్యాప్ ప్రకారం కొల్లేరు అభయారణ్య పరిధి సరిహద్దుల నిర్ధారణ జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టరు యంజే అభిషేక్ గౌడ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో కొల్లేరు అభయారణ్య భూముల హద్దుల నిర్ధారణ (ఉమ్మడి తనిఖీ)పై అటవీ, రెవెన్యూ, నీటిపారుదల, సర్వే విభాగాలు, పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధి ఏలూరు జిల్లాలోని 8 మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక మండలం కలిపి మొత్తం 55 గ్రామాల్లో 77 వేల ఎకరాల భూమి ఉందని అన్నారు. ఇప్పటివరకు 44 కొల్లేరు గ్రామాల్లో హద్దులను నిర్ధారించగా మిగిలిన 11 గ్రామాల్లో ఉమ్మడి తనిఖీ 20 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నిబంధనల మేరకు కొల్లేరు హద్దులు నిర్ధారణ (ఉమ్మడి తనిఖీ) పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ దేవప్రకాష్, డీఎఫ్‌వో విజయ, సర్వే సహాయ సంచాలకులు అన్సారీ, రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖ అధికారులు, డివిజన్ , మండల సర్వేయర్లు, అటవీ శాఖ సెక్షన్ అధికారులు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


