మాలలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణం
తాడేపల్లిగూడెం: అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు ఆ వాగ్దానాలను నిలబెట్టుకోలేదని గురువారం పట్టణంలో జరిగిన మాలమహానాడు సమావేశంలో జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా, నామినేటెడ్ పదవుల్లో మాలలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మాదిగలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మాలలు కూడా టీడీపీలో ఉన్నారన్న సంగతిని గుర్తు చేసుకోవాలన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు 15 నుంచి 20 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్ శాతాన్ని ఏడు నుంచి పది శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. మాలలకు అన్యాయం చేసిన వారికి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంగరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 21న కడకట్లలో జరగనున్న మాలల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు.


