నిబంధనలు ఖైమా
డంపింగ్ యార్డును తలపిస్తున్న కబేళా
చర్యలు తీసుకుంటాం
● కబేళాలో జీవాల కటింగ్ నిల్
● పశువైద్యుల పర్యవేక్షణ లేదు
● వేట మాంసంపై కనిపించని స్టాంపు
నూజివీడు: పట్టణంలో ముక్క లేనిదే ముద్ద దిగని మాంసం ప్రియుల సంఖ్య భారీగానే ఉంది. ఇక ఆదివారం, గురువారమొస్తే మాంసం వినియోగం గణనీయంగానే ఉంటుందనేది తెలిసిందే. అయితే తాము కొనుగోలు చేస్తున్న మాంసం నాణ్యమైనదేనా కాదా అని గుర్తించలేని వారు చాలా మందే ఉన్నారు. దుకాణదారులు ప్రజలకు విక్రయించే మాంసం నాణ్యమైనదా, కాదా అని తనిఖీ చేసే అధికారులు కరువయ్యారు. దీంతో పట్టణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు నిబంధలను ఖైమా కొడుతూ తగిన ప్రమాణాలు పాటించకుండా నాణ్యతలేని మాంసాన్ని అంటగడుతున్నారు. పట్టణంలో 25 వరకు మాంసం దుకాణాలు ఉండగా ఆది, గురువారాల్లో 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు వేటమాంసం విక్రయాలు ఉంటాయి. కిలో మాంసం ధర రూ.800 నుంచి రూ.900 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయితే విక్రయిస్తున్న మాంసం నాణ్యమైనదా లేదా అనేది ప్రశ్నార్థకంగా తయారైంది. చాలా మంది దుకాణదారులు కబేళాలో కోయకుండా ఇళ్ల వద్దనే కోసేసి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు.
పశువైద్యాధికారి ధ్రువీకరణ లేకుండానే..
నిబంధనల ప్రకారం పశు వైద్యాధికారుల పరిశీలన చేసి ఆరోగ్యకరమైన జీవాలని ధ్రువీకరించిన తరువాతే కబేళాలో కోయాలి. శుభ్రం చేసిన తరువాత కూడా వైద్యులు మరోసారి క్షుణ్ణంగా పరీక్షించి మాంసం సురక్షితమైందని ముద్రవేసిన అనంతరమే దుకాణాల్లో పెట్టి విక్రయాలు జరపాలి. మాంసం విక్రయాలకు ఉంచినప్పుడు దుమ్మూ, ధూళి, ఈగలు, దోమలు వాలకుండా వాటిపై తెరకప్పి ఉంచాల్సిఉంది. అయితే పట్టణంలో ఈ ప్రక్రియ కొనసాగడం లేదు. కబేళా ఉన్నా అందులోకి పశువైద్యాధికారులెవరూ రావడం లేదు. మున్సిపాలిటీ పాలకులు కూడా ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. మరికొందరు తమ ఇళ్ల వద్ద, ఇతర ప్రాంతాల్లో కోసి బహిరంగ మార్కెట్లో పెట్టి మాంసం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి కొందరు వ్యాపారులు మిగిలిన మాంసాన్ని ఫ్రిజ్‌ల్లో ఉంచి మరుసటి రోజు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
జీవాలను వధించే కబేళా డంపింగ్ యార్డును తలపిస్తోంది. జీవాలు వధించే ప్రాంతం తీవ్ర అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా దుర్వాసన వెదజల్లుతోంది. అధ్వాన్నంగా ఉన్న ప్రదేశంలోనే జీవాలను కటింగ్ చేసి పడేస్తున్నారు. పరిశుభ్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనలను ఎవరూ పాటించకుండా గాలికొదిలేశారు. పశువైద్యాధికారి సర్టిఫై చేసిన మాంసాన్నే విక్రయించాల్సి ఉండగా గత కొన్నేళ్లుగా స్టాంపు వేసే పద్ధతే లేకుండా పోయింది. వేట మాంసం తాజాదైతే లేత తెలుపు, లేత పింక్ రంగులో ఉంటుందని, కల్తీ, నిల్వ ఉంచిన, చెడిపోయిన మాంసం ముదురు ఎరుపు రంగులో ఉంటుందని పశువైద్యాధికారులు పేర్కొంటున్నారు.
మాంసం దుకాణదారులు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాం. కబేళాలో పశువైద్యాధికారి ఉండి జీవాలను పరీక్షించి మాంసం కోసిన తరువాత స్టాంపు వేసిన అనంతరమే విక్రయించేలా చూస్తాం. కబేళాను సందర్శించి అక్కడి పరిస్థితిని గమనించడం జరిగింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకుంటాం.
– కొరపాటి పీరయ్య,
మున్సిపల్ కమిషనర్, నూజివీడు
నిబంధనలు ఖైమా
నిబంధనలు ఖైమా


