మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు చేపట్టాలి

Dec 19 2025 8:17 AM | Updated on Dec 19 2025 8:17 AM

మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు చేపట్టాలి

మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు చేపట్టాలి

మామిడి శాస్త్రవేత్త బొర్రా కనకమహాలక్ష్మి

నూజివీడు : మామిడి తోటల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా తెగుళ్లు, పురుగులు ఆశించకుండా ఉంటాయని నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బొర్రా కనకమహాలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని రావిచర్ల, బోర్వంచలలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మామిడి రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త కనకమహాలక్ష్మి మాట్లాడుతూ తోటల్లో పూతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయని, తోటల్లో ఎండుకొమ్మలు లేకుండా తీసివేయాలని సూచించారు. పొటాష్‌ 5 గ్రాములు, జింక్‌, బోరాన్‌ 2 గ్రాముల చొప్పున లీటరు నీటికి, నీటిలో కరిగే గంధకం లీటర్‌ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మామిడి తోటలకు పిచికారీ చేయాలన్నారు. తోటల్లో రసం పీల్చే పురుగులు లేదా తేనెమంచు పురుగు లేదా తామర పురుగుల ఉనికిని గమనించిన యెడల ఇమిడోక్లోప్రిడ్‌ 0.3 ఎంఎల్‌, పిప్రోనిల్‌ 2 ఎంఎల్‌, సాఫ్‌ 2 గ్రాములు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. రైతులు పండు ఈగ నివారణకు ముందస్తుగానే ఎర్రలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పండు ఈగ ఎర్రలు మామిడి పరిశోధనాస్థానంలో అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే మామిడి కాయలకు కవర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారిణి ఆర్‌ హేమ మాట్లాడుతూ మామిడి కవర్లను ప్రభుత్వం రాయితీపై అందజేస్తోందని, ఒక ఎకరాకు 6 వేల కవర్లు ఇస్తామని, మొత్తం ఖర్చు రూ.12 వేలు కాగా కవర్లకు రూ.6 వేలు, కూలీలకు రూ.2500 కలిపి మొత్తం రూ.8500 రాయితీగా అందజేస్తామన్నారు. ఒక రైతుకి 5 ఎకరాల వరకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కాపా శ్రీనివాసరావు, బోర్వంచ సర్పంచి కుంటం ఉదయరాజు, రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement