మహిళా సర్పంచ్‌కు అవమానం
ఆకివీడు: చినమిల్లిపాడు గ్రామంలో మహిళా సర్పంచ్‌కు అవమానం జరిగింది. ప్రోటోకాల్ పాటించకుండా అభివృద్ధి పనులను వీఆర్వో ప్రారంభించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీడీఓకు, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. వీఆర్వోపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అసలేం జరిగిందంటే..
ప్రజలు తాగునీటి కోసం 15, 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని, దీంతో వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ద్వారా వాటర్ ఫిల్టర్ బెడ్‌ల మరమ్మతులకు పంచాయతీ నిధులు రూ.లక్ష కేటాయించినట్లు సర్పంచ్ సీత తెలిపారు. ఆయా పనులకు వర్కు ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించాల్సి ఉంందన్నారు. కానీ ముందుగానే కుతంత్రాలతో కూటమి నాయకులని చెప్పుకుంటున్న కటికల యోషయ్యరాజు, కటికల దీనరాజు, గ్రామ వీఆర్‌ఓ జంపా ఏసుబాబు ఫిల్టర్ బెడ్‌ల వద్ద పనులు నిర్వహిహించేందుకు కొబ్బరికాయ కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ మహిళా సర్పంచ్‌గా ఉన్న తనను అవమానపరచే విధంగా గ్రామ రెవెన్యూ అధికారి ప్రవర్తిస్తున్నారని వాపోయారు.
ఆర్వో ప్లాంటుకూ తాళం
గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వంలో దాతల సహకారంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా ప్రజలకు మంచినీరు అందిస్తున్నట్లు చినమిల్లిపాడు సర్పంచ్ గురుదాసు సీత తెలిపారు. దానికి అయ్యే నిర్వహణా వ్యయం అంతా తామే బరాయిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్వో ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుని, తాళం వేశారని ఆరోపించారు. 18 నెలలుగా తాళం వేసి ఉంచినా చర్యలు లేవన్నారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వచ్చిన ఎస్సై గ్రామంలో తగవులొద్దని తెలపడంతో వెనకడుగు వేశామన్నారు. ఎస్పీ కేసులు పెడతామని బెదిరించారని ఆమె వాపోయారు. ప్రస్తుతం వాటర్ ఫిల్టర్ బెడ్‌ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయగా ఆ పనుల్లో కూడా తమ ప్రమేయం లేకుండా వీఆర్వో జంపా ఏసుబాబు కూటమి నాయకులతో కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వీఆర్వోపై తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గురుదాసు సీత గురువారం ఎంపీడీవో, ఎమ్మార్వోలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ వైఎస్సార్‌సీపీ నాయకులు నంద్యాల సీతారామయ్య, అంబటి రమేష్, గ్రామ ఉప సర్పంచ్ గురుదాసు బాలాజీ, మాజీ ఉప సర్పంచ్ మద్దా చౌదరి, విలియంకేరీ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను వీఆర్‌ఓ ప్రారంభించడంపై అభ్యంతరం
ఎంపీడీఓ, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేసిన చినమిల్లిపాడు సర్పంచ్


