వివిధ చోరీ కేసుల్లో నలుగురి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.10 లక్షల విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆమె వివరాలు వెల్లడించారు. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన సూరం జయరాజు ఈనెల 14న మోటార్‌సైకిల్‌పై ఏలూరు వెళ్లి తిరిగి వస్తుండగా, తడికలపూడి వద్ద రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించి చంపుతానని బెదిరించి రూ.20వేలు లాక్కొని పరారయ్యారు. దీనిపై బాధుతుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ కేపీఎస్ కిషోర్ పర్యవేక్షణలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ఆధ్వర్యంలో సీఐ ఎంవీ సుభాష్ ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు. నిందితులు కొయ్యలగూడెం మండలం మంగపతిదేవీపేటకు చెందిన జువ్వా సురేష్, నేకూరి ప్రదీప్‌కుమార్, యర్రంపేటకు చెందిన పోలుపాము కళ్యాణ్, కడియం మండలం జేగూరుపాడుకు చెందిన మంగళగిరి శ్రీనులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ చెప్పారు. విచారణలో వివిధ ప్రాంతాలకు సంబంధించి నిందితుల నుంచి రెండు స్కూటీలు, మహీంద్ర ట్రాక్టర్, ట్రక్కు, రూ.16 వేల నగదు, ఒక చాకు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సీఐ ఎంవీ సుభాష్, తడికలపూడి ఎస్సై చెన్నారావు, ఐడీ పార్టీ ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను ఏఎస్పీ అభినందించారు.
రూ.10 లక్షల విలువ గల చోరీ సొత్తు స్వాధీనం


