వేడుకగా శ్రీవారికి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: ధనుర్మాస వేడుకల్లో రెండో రోజు గురువారం శ్రీవారికి తిరువీధి సేవ క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా జరిగింది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం హారతులిచ్చారు. ఆ తరువాత ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం తిరువీధి సేవకు పయనమైంది. అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, అశ్వ, గజ సేవల నడుమ శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.


