తీరంలో మళ్లీ విషపు ఈగల పంజా
నరసాపురం: నరసాపురం తీరప్రాంత గ్రామాల్లో విషపుటీగలు మళ్లీ పంజా విప్పుతున్నాయి. దీంతో గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. బుధవారం నరసాపురం మండలం సారవలో తాటిచెట్ల ఆకుల మధ్య పెద్ద విషపుటీగల పుట్టలను గ్రామస్తులు గురించారు. రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఏమాత్రం స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం తీరగ్రామాలైన వేములదీవి, తూర్పుతాళ్లు, పేరుపాలెం, కేపీపాలెం ప్రాంతాల్లో విషపుటీగలు భయపెట్టాయి. దాడిచేసి కుట్టడంతో గ్రామాలకు చెందిన 30 మంది తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాపులతో ఇబ్బందులు పడ్డారు. విషపుటీగల భయం లేకుండా చర్యలు చేపట్టాలని తీర గ్రామాల వాసులు డిమాండ్ చేస్తున్నారు.


