పది పరీక్షల కార్యాచరణ సవరించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపధ్యంలో విద్యార్థులకు అమలు చేస్తున్న నూరు రోజుల కార్యాచరణ ప్రణాళిక అసంబద్ధంగా ఉందని, సవరణలు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను కోరారు. బుధవారం ఏపీటీఎప్ నాయకులు డీఈఓకు వినతిపత్రం సమర్పించారు. సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహించాల్సి వస్తోందని, సెలవు రోజుల్లో విధులకు హాజరైన ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు చేయాలని కోరారు. అదనపు సమయంలో పరీక్ష నిర్వహించి విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆన్‌లైన్ చేయడం వల్ల ఉపాధ్యాయులకు అదనపు భారం తప్ప విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కార్యాచరణ కాకుండా విద్యార్థుల స్థాయిని బట్టి బోధించే అవకాశాన్ని ఉపాధ్యాయులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ళూరి రామారావు, బీ రెడ్డిదొర, ఉపాధ్యక్షుడు డీకేఎస్‌ఎస్ ప్రకాష్, ఎం.వెంకటేశ్వర రావు, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు ఆనంద్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా కేంద్రం ఏలూరులో జరుగుతున్న టెట్ పరీక్షకు బుధవారం 323 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం జరిగిన పరీక్షకు 175 మందికి గాను 159 మంది హాజరు కాగా మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 176 మందికి గాను 164 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పర్యవేక్షించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
ఏలూరు (టూటౌన్): బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో వంద రోజుల పాటు నిర్వహించే బాల్య వివాహాల నిరోధ చట్టాలపై అవగాహన సదస్సుల నిర్వహణ నిమిత్తం ఏలూరు పారా లీగల్ వాలంటీర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ వలంటీర్లను గ్రామాలకు పంపి విచారణ జరిపి, కౌన్సిలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. బాల్య వివాహాల సమాచారం తెలిస్తే 1098 లేదా 15200 నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ కార్గో సర్వీస్‌లో డోర్ డెలివరీ మాసోత్సవాలు ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు నిర్వహించనున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని 84 పట్టణాలలో 50 కేజీల వరకు బరువైన వస్తువులను 10 కి.మీ దూరం వరకు డోర్ డెలివరీ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. క్రిస్మస్, జనవరి 1, సంక్రాంతి సందర్భంగా తమకు నచ్చిన వ్యక్తులకు కోరిన ప్రదేశాలకు సురక్షితంగా, వేగంగా డోర్ డెలివరీ చేస్తారని, చెప్పారు.
తాడేపల్లిగూడెం: రైతులకు ఉపకరించే పరిశోధనలు చేయాలని కొత్తగా ఎంఎస్సీ హార్టీకల్చర్ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉద్యాన వర్సిటీ ఇన్‌చార్జి వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు కోరారు. వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట ఉద్యాన కళాశాలల్లో ఎంఎస్సీ హార్టీకల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక్కడ బుధవారం కౌన్సిలింగ్ జరిగింది. ఐసీఏఆర్ జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సిలింగ్ జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. 110 సీట్లకు కౌన్సెలింగ్ జరగగా 81 మంది చేరారు. మిగిలిన 29 సీట్లకు తదుపరి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.


