ప్రారంభమైన ఆస్పత్రి నిర్మాణ పనులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం శివారు పద్మవారిగూడెం అల్లికాల్వ సమీపంలో నిలిపోయిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఆస్పత్రి నిర్మాణానికి సుమారు రూ.50 కోట్లతో 146 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేశారు. 2020 అక్టోబర్ 2వ తేదీన పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన చేశారు. ఫేజ్–1లో ఆస్పత్రి భవనం, ఫేజ్–2లో స్టాఫ్ క్వార్టర్స్, ఫేజ్–3 పేషెంట్స్ అటెన్డెన్స్ భవనాల నిర్మాణం చేపట్టారు. మొదటి ఫేజ్ భవనం స్లాబ్ వరకూ పూర్తి అయ్యింది. మిగిలిన పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. జరిగిన పనులను సుమారు రూ. 12 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. అగిపోయిన పనులు చేపట్టాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు, సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమైంది. సరిహద్దు పనులు, అలాగే ఫేజ్ –2లో నిలిచిన స్టాఫ్ క్వార్టర్స్, పేషెంట్స్, అటెన్డెన్స్ భవనాల పనులు జరుగుతున్నాయి.


