పరిహారంలో గందరగోళం
న్యూస్‌రీల్
అయితే కోత.. లేదంటే రెట్టింపు
గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం నిర్వాసితుల పట్ల అధికారుల నిర్లక్ష్య ధోరణి పరాకాష్టకు చేరింది. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలవరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పంపిణీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఇంటి విలువ (స్ట్రక్చర్ వాల్యూస్) పరిహారం పంపిణీలో నిజమైన నిర్వాసితులను అధికారులు నిలువునా ముంచుతున్నారు. కొంతమంది నిర్వాసితులకు రావాల్సిన ఇంటి విలువల పరిహారాన్ని కుదించి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. మరికొంతమంది ఒకే ఇంటి విలువను రెండు సార్లు జమచేస్తూ, మళ్ళీ రికవరీ చేస్తూ నిర్వాసితుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొత్తం 3,500 నిర్వాసితులకు ఇంటి విలువ పరిహారం రూ.105 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 3002 మంది నిర్వాసితులకు బిల్లు పెట్టగా, 498 మందికి ఇంకా బిల్లులు పెట్టాల్సి ఉంది. అసలు పూర్తి పరిహారం పొందాల్సిన నిర్వాసితుడి ఇంటికి అరకొరగా నష్ట పరిహారం చెల్లిస్తున్నారు. మరోచోట అసలు పరిహారం కన్నా ఇంటి పరిహారాన్ని రెండు సార్లు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. తిరిగి మళ్ళీ రికవరీ చేస్తున్నారు.
గందరగోళంలో నిర్వాసితులు
వేలేరుపాడు సంత బజారులో అవార్డు నంబర్ 328, 329, 330, 331, 332లో కోటా శాంతిశ్రీ పేర ఉన్న పక్కా భవనాలకు రూ.49.22 లక్షలు రావాల్సి ఉండగా నవంబర్ 18న రూ.74.19 లక్షలు పేమెంట్ చేసి, నవంబర్ 25న రూ.24.93 లక్షలు రికవరీ చేశారు. జగన్నాధపురంలో అవార్డు నంబర్ 32లో పాడుగుల ఈశ్వరికి చెందిన పక్కాభవనానికి రూ.26.88 పరిహారం చెల్లించాల్సి ఉండగా, రూ.6 లక్షల పరిహారాన్ని నవంబర్ 28న చెల్లించారు. మిగతా పరిహారం ఈ నెల 2న చెల్లించారు.
కుక్కునూరు మండలంలో ఏడుగురు నిర్వాసితుల ఇళ్లకు డబుల్ పేమెంట్ చేసి పదిరోజుల తర్వాత రికవరీ చేశారు. ఇక్కడ మరో నిర్వాసితుడి ఇంటికి పది లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ. 20 లక్షలు చెల్లించారు. అధికారులు ఎక్కడ రికవరీ చేస్తారో అని సదరు నిర్వాసితుడు ఊరి వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. చీరవల్లి మాధారంలో ఎస్‌ఈఎస్ నంబర్ 2/96లో ఇంటికి రూ.1.02 లక్షలు ఇంటి పరిహారం చెల్లించాల్సి ఉండగా, రూ.14 లక్షలు చెల్లించారు. ఇదే గ్రామంలో ఎస్‌ఈఎస్ నంబర్ 1/45 లో ఉన్న ఇంటికి 1,49,068 చెల్లించాల్సి ఉండగా రూ.14 లక్షలు చెల్లించారు. ఇకనైనా అధికారులు మేల్కొని నిర్వాసితులకు చెల్లించాల్సిన అసలు పరిహారం అందించి, న్యాయం చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
జమ, రికవరీలతో నిర్వాసితుల్లో తీవ్ర ఆందోళన
ఇంటి విలువ, పరిహారాల్లో భారీ కోతలు
మునిగిపోతున్న నిర్వాసితులు
అధికారుల నిర్లక్ష్యంతోనే అసలు సమస్య
వేలేరుపాడు మండల కేంద్రంలో ఎస్‌ఈఎస్ నంబర్ 230, అవార్డు నంబర్ 390లో తుమ్మల రాజశేఖర్‌కు చెల్లించాల్సిన ఇంటి విలువ రూ.21.36 లక్షలు ఉండగా, అధికారులు చేసిన తప్పిదం వల్ల రూ.2 లక్షలు మాత్రమే జమ చేశారు. మిగతా రూ. 19.36 లక్షలు చెల్లించలేదు. అదేంటని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని బాధితుడు వాపోతున్నాడు. వేలేరుపాడులో అవార్డు నంబర్ 621లో పొంగులూరి సాంబశివరావు ఇంటికి రూ.9.59 లక్షలు పరిహారం జమచేయాల్సి ఉండగా, రూ.19.18 లక్షలు జమచేశారు. మళ్ళీ హడావుడిగా రికవరీ చేశారు. అదే గ్రామంలో అవార్డు నంబర్ 578లో షేక్ మహుబూబున్నిసా ఇంటికి రూ.6.18 లక్షలు వేయాల్సి ఉండగా, రూ.12.36 లక్షలు జమ చేసిమళ్ళీ రికవరీ చేశారు. అవార్డు నంబర్ 547లో కరకా వెంకమ్మకు రూ.2.53 లక్షలు జమ కావాల్సి ఉండగా రూ. 5.6 లక్షలు జమ చేశారు. రూ. 1.3 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. మిగతా సొమ్ములు బాధితులు ఖర్చు చేయడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.
పరిహారంలో గందరగోళం
పరిహారంలో గందరగోళం


