రబీ సాగుకు రైతన్న సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఖరీఫ్‌లో ప్రకృతి విపత్తులు, అనేక కష్ట నష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనా అన్నదాత అన్నింటికి తట్టుకుని రబీ సాగుకు సన్నద్ధమయ్యాడు. ఖరీఫ్ ధాన్యం సొమ్ముల కోసం ఎదురుచూస్తూనే రబీ పనులకు శ్రీకారం చుట్టాడు. జిల్లా వ్యాప్తంగా 2.38 లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగు జరగాల్సి ఉండగా ఇంత వరకు 25 వేల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. అత్యధికంగా 96 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ 50 శాతం మేర పూర్తయ్యింది. సుమారు ఖరీఫ్‌లో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇంత వరకు జిల్లా వ్యాప్తంగా 2,43,310 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు రైతుసేవా కేంద్రాల ద్వారా కొంత, సహకార సొసైటీల ద్వారా, నేరుగా కొనుగోలు చేశారు. సుమారు రూ.475 కోట్లు చెల్లించాల్సి ఉండగా కొంత మేర బకాయిలు ఉన్నాయి. వచ్చే నెల రెండో వారం నాటికి జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు తుది దశకు చేరే అవకాశం ఉంది.
జనవరి మొదటి వారంలో నాట్లు
ఈ క్రమంలో మరోవైపు రబీ సీజన్ సన్నాహాలు గ్రామాల్లో మొదలయ్యాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా నారుమడులు మొదలుపెట్టారు. జనవరి మొదటి వారం నుంచి నాట్లు వేసేలా నారుమడులు సిద్ధం చేశారు. రానున్న రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 96,567 ఎకరాల్లో వరి, 121 ఎకరాల్లో జొన్న, 75,917 ఎకరాల్లో మొక్కజొన్న, 14,945 ఎకరాల్లో పెసలు, 24,043 ఎకరాల్లో మినుములు అలాగే 2901 ఎకరాల్లో వేరుశెనగ, 23,680 ఎకరాల్లో వాణిజ్య పంట పొగాకు సాగుతో పాటు ఇతర పంటలు సాగు చేయనున్నారు. వీటిలో ఇప్పటికే 11,974 ఎకరాల్లో మొక్కజొన్న, 3,544 ఎకరాల్లో పెసలు, 1,094 ఎకరాల్లో మినుముల సాగు పూర్తి చేశారు. 9,271 ఎకరాల్లో పొగాకు సాగు పూర్తయ్యింది. ఈ నెలాఖరు నాటికి సాగు విస్తీర్ణం 60 శాతానికిపైగా చేరే అవకాశం ఉంది. జనవరి చివరి నాటికి పూర్తి సాగు విస్తీర్ణం అందుబాటులోకి రానుంది. జిల్లాలో వరికి సంబంధించి అత్యధికంగా తక్కువ కాల పరిమితి ఉన్న ఎంటీయూ 1121, 1282, 1293, 1426, 1153 రకాలు అత్యధికంగా సాగు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎరువుల కొరత నేపథ్యంలో జిల్లాకు రబీ సీజన్‌కు సంబంధించి 1.50 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నట్లు అంచనాలు సిద్ధం చేశారు.
16న సాగునీటి సలహా మండలి సమావేశం
రబీ సాగు నేపథ్యంలో ఈ నెల 16న జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏలూరు జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం జరగనుంది. గోదావరి పశ్చిమ డెల్లా ఆయకట్టు పరిధిలోని రబీ పంటలకు నీటి లభ్యత, అనంతరం కాల్వల మూసివేసే తేదీలను ఖరారు చేయడం, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి సాగు విస్తీర్ణం, నీటి విడుదల చేసే తేదీలను నిర్ణయించడం చేస్తారు.
96 వేల ఎకరాల్లో వరి పంట
ఇప్పటికే తుది దశకు ఆకుమడులు
వచ్చే నెల మొదటివారం నుంచి నాట్లు
75 వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు


