మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలోని ఆలయ ముఖ మండపంపై శనివారం స్వామి వారికి పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వివిధ సేవల రూపేణా రూ.1,58,432 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. అలాగే, స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 2,127 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
తణుకు అర్బన్: తణుకు మండలం ముద్దాపురం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి కొయ్యలమూడి బృహతి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. మహాభారతానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతోపాటు మహాభారతంలోని పాత్రలను గుర్తుచేసుకోవడం, అనర్ఘళంగా సంస్కృత శ్లోకాలు, తెలుగు నర్సరీ రెయిమ్స్ పఠించడం, గృహోపకరణాలను, శరీరంలోని భాగాలు, క్రియలు, జంతువులు, ఆకారాలు, కూరగాయలు గుర్తించి వాటి పేర్లు చెప్పడం, ఆంగ్లం, తెలుగులో 1 నుంచి 10 వరకు సంఖ్యలను లెక్కించడం వంటివి చిన్న వయసులోనే చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌చే ‘ఐబీఆర్ అచీవర్’ గా నవంబర్ 17, 2025న గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈనెల 10వ తేదీన తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ సందర్భంగా చిన్నారి బృహతితోపాటు తల్లిదండ్రులు అనూష, గోవర్థన్‌లను పలువురు అభినందించారు.
అప్పుల బాధ తాళలేక
అంబులెన్స్ డ్రైవర్ ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం: అప్పుల బాధ తట్టుకోలేక ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎన్.వీరప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన పప్పవరపు శివ (32) జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఈ నెల 6వ తేదీన ఆసుపత్రుల్లో క్లీన్ చేసే పారాగాట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శివకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భీమడోలు: జాతీయ రహదారి భీమడోలులోని అయ్యప్ప స్వామి గుడి వద్ద గురువారం ఆర్ధరాత్రి లారీలోని నగదు చోరీకి గురైంది. తెలంగాణ రాష్ట్రం నందివాడ మండలం పాలకొండ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కమ్ గుమాస్తా బొమ్మనపల్లి శ్రీనివాస్ లారీ క్లీనర్‌లతో కలిసి తూర్పు గోదావరి జిల్లా మల్కీపురం నుంచి గుడివాడకు లారీలో వెళ్తున్నారు. మార్గమధ్యమైన భీమడోలు అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి నిద్ర వస్తుండడంతో లారీ ఆపి వారి వద్ద గల రూ.1.50 లక్షల నగదును సీటు కింద పెట్టుకుని నిద్రించారు. ఉదయం లేచి చూసేసరికి ఆ నగదు కనిపించలేదు. దీనిపై లారీ డ్రైవర్ శ్రీనివాస్ భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెనుగొండ: సిద్ధాంతం జాతీయ రహదారిలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యంను, వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు విజిలెన్స్ ఎస్సై కే.నాగరాజు తెలిపారు. శనివారం రీజనల్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కే నాగేశ్వరరావుకి అందిన సమాచారంతో స్థానిక రెవెన్యూ, పౌర సరఫరా అధికారులతో కలసి ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. పీడీఎస్ రైన్ యజమాని గెల్లి విశ్వనాథగుప్తా, నేతేటి వెంకటేష్, లంక వెంకట్రావు, చోడపనేని సాయి దుర్గ ప్రవీణ్, గోవరపు అవినాష్‌లపై నిత్యవసర వస్తువుల చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
మద్దిలో అభిషేక సేవ
మద్దిలో అభిషేక సేవ


