గోదావరిలో యువకుడి గల్లంతు
కుక్కునూరు: గోదావరిలో స్నానానికి దిగిన యువకుడు నీటి ప్రవాహంలో పడి గల్లంతైన ఘటన శుక్రవారం మధ్యాహ్నాం మండలంలోని దాచారం రేవులో జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం బెస్తగూడెం గ్రామానికి చెందిన కుమ్మరపల్లి నాగార్జున(22) కార్పెంటర్ పనులు చేస్తుంటాడు. ఇటీవల అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నాం తోటి దీక్షధారులతో కలిసి గోదావరి నదిలోకి స్నానానికి దిగాడు. ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో లోతును గమనించని నాగార్జున కొద్దిగా ముందుకు వెళ్లడంతో మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ రమేష్‌బాబు జాలర్లను తీసుకోచ్చి సాయంత్రం వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. యువకుడు వైఎస్సార్‌సీపీ అభిమాని కావడంతో విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్, నాయకులు రావు వినోద్, మల్లెల చంటినాయుడు ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలను పరిశీలించారు. కుటుంబసభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


