చోరీ కేసుల్లో దొంగల అరెస్ట్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని నూజివీడు, దెందులూరు ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేసి, భారీగా బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం ఎస్పీ శివ కిశోర్ వివరాలు వెల్లడించారు. నూజివీడు పట్టణం, పరిసర ప్రాంతాల్లో మోటారు సైకిళ్ళ చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను నూజివీడు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ పర్యవేక్షణలో సీఐ సత్యశ్రీనివాస్, ఎస్‌ఐ కే.నాగేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. నూజివీడు రామన్నగూడెం రోడ్డులోని డంపింగ్ యార్డ్ వద్ద ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
దలాయి గణేష్ అలియాస్ నాగ, చౌటపల్లి సుభాష్ అలియాస్ సుబ్బు, షేక్ ఆసీఫ్ ఉల్లా అలియాస్ ఆసిఫ్, చిత్తూరి అజయ్‌కుమార్ అలియాస్ అజయ్‌ను అరెస్ట్ చేశారు. వీరు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి బైక్‌ల చోరీలకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి 12 కేసుల్లో 12 బైక్‌లు పోలీసులు రికవరీ చేశారు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.9.08 లక్షలు ఉంటుందని అంచనా.
లింగపాలెం మండలం కళ్ళచెరువు గ్రామంలో మనీషా వైన్స్ షాప్‌లో గుమస్తాగా పనిచేస్తోన్న గుడివాక ఆంజనేయ ప్రసాద్ అక్టోబర్ 28న వైన్స్‌షాప్ నగదు రూ.40 వేలు తీసుకుని బైక్‌పై ప్రయాణమయ్యాడు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారు. అతడిని నిలువరించి కర్రలో కొట్టి రూ.40 వేల నగదుతో పారిపోయారు. పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్ కేసును దర్యాప్తు చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సోమవరప్పాడు గ్రామంలో ఐదుగురిని అరెస్ట్ చేసి చోరీ సోత్తు స్వాధీనం చేసుకున్నారు. బంగారు సుబ్రహ్మణ్యంపాటు మరో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 9 బైక్‌లు, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా దెందులూరు, పెదవేగి, ద్వారకాతిరుమల, ఏలూరు నగరంలో చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై 12 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
21 మోటారు సైకిళ్ల రికవరీ


