ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు
ఉండి: ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలకు అధికారులు స్పందించారు. ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని తనిఖీలకు ఆదేశించారు. అత్తిలి సబ్ రిజిస్ట్రార్ వీవీవీ సత్యనారాయణ, ఆకివీడు, భీమ వరం కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు కిరణ్‌కుమార్, ఎస్‌కే ఆలీ బృందంగా గురువారం ఇక్కడి తనిఖీలు చేశారు. గతేడాది కాలంగా రిజిస్ట్రేషన్లు పరిశీలిస్తున్నారు. నాలుగు రోజులపాటు తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. ఏడాదిలో సుమారు 1,300 వరకు ఎనివేర్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్క కృష్ణా జిల్లా బంటుమిల్లి కార్యాలయ పరిధిలోని ఆస్తులు 300 డాక్యుమెంట్లు ఇక్కడ రిజిస్టర్ చేయడం గమనార్హం. అలాగే కృష్ణా జిల్లా పెడన, మచిలీపట్నం, బంటుమిల్లి, మండవల్లి, ఉయ్యూరు, కైకలూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఏలూరు, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన వందలాది డాక్యుమెంట్లు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిగిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఏసీబీ సోదాలు ఉంటాయని అందరూ భావించారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ప్రత్యేకాధికారుల బృందాన్ని పంపించింది.
న్యాయం చేయాలి : ఉండి కార్యాలయంలో అవి నీతి బట్టబయలు కావడానికి ప్రధాన కారణంగా ఉన్న కురెళ్ల రాజ్‌కుమార్ ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ సు రేష్‌ను కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. ఆయన ఆరు నెలలుగా ఇక్కడ పోరాటం చేస్తున్నారు.


