రైతులను సత్వరమే ఆదుకోవాలి
ముదినేపల్లి రూరల్: మోంథా తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. మండలంలోని వణుదుర్రులో తుపాను వల్ల నీటమునిగిన పంట పొలాలను డీఎన్నార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే సమయంలో నీటిపాలు కా వడం బాధాకరమన్నారు. దీనివల్ల రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నట్టు చెప్పారు. రైతులను తక్షణమే ఆర్థికంగా ఆదుకోకుంటే వ్యవసాయానికి దూరమయ్యే ప్రమాదముందన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బోయిన రామారాజు, జిల్లా యాక్టివ్ సెక్రటరీ కట్టా మహేష్, సర్పంచ్ చిన్నం సుగుణబాబు, ఉప సర్పంచ్ ఈడే పూర్ణచంద్రరావు, నాయకులు ఉన్నారు.


