వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
టి.నరసాపురం: వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, భూమిలేని పేదలకు భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం 32వ మహాసభలను సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మహాసభల ప్రారంభ సూచిక వ్యవసాయ కార్మిక సంఘం జెండాను సంఘం సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు వై.నాగేంద్రరావు ఆవిష్కరించగా మహాసభ అధ్యక్షవర్గంగా ఎం.జీవరత్నం, తామా ముత్యాలమ్మ, వై.నాగేంద్రరావు, డి.రవీంద్ర అధ్యక్షతన మహాసభ నిర్వహించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో భూమి, ఉపాధి హామీ, ఇళ్ల స్థలాలు, పామాయిల్ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. భూమిలేని పేదలకు భూ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములపై 9/77 చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని కోరారు. అసైన్డ్ భూములను పలుకుబడి కలిగిన వారికి, గ్రామీణ సంపన్నులకు కట్టబెట్టడానికే ఈ ఫ్రీ హోల్డ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం చేసిందని విమర్శించారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మహాసభ నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లాలో 18 మండలాల నుంచి 150 మంది ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి మాట్లాడుతూ అసైన్డ్ భూములకు రక్షణ కవచంగా ఉన్న 9/77 చట్టాన్ని యథాప్రకారంగా అమలు చేసి అనర్హుల చేతుల్లో ఉన్న అసైనన్డ్ భూములను కోల్పోయినటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాల పేదలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభల్లో సంఘం జిల్లా కమిటీ సభ్యులు వై.సీత, సాయి కృష్ణ, హోలీ మేరీ, చిన్న మాధవ, రాము, చలపతి, మడకం సుధారాణి, మడకం కుమారి, బి.రాజు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: సింగపూర్ అధునాతన విద్యావిధానాన్ని అధ్యయనం చేసేందుకు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పనిచేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, జువాలజీ అధ్యాపకుడు గుర్రం గంగాధర్ ఎంపికయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ సింగపూర్‌లోని ప్రముఖ పాఠశాలలను సందర్శించి అక్కడ అధునాతన సాంకేతిక విధానాలను, బోధనా పద్ధతులను, తరగతి గదుల్లోని వాతావరణ, బోధనా పద్ధతులు, మౌలిక ప్రమాణాలను అధ్యయనం చేయనున్నట్లు ఎంపికై న అధ్యాపకుడు గంగాధర్ చెప్పారు. గంగాధర్ ఎంపికపై పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు పట్టణానికి చెందిన షేక్ సమీరుద్దీన్ అండర్ 19 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికై నట్లు అతని మేనమామ షేక్ రఫీ గురువారం తెలిపారు. డిసెంబర్ 5 నుంచి 9 వరకూ హర్యానాలో జరగనున్న అండర్ 19 స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జిఎఫ్‌ఐ) క్రికెట్ 69 వ నేషనల్ క్రీడల్లో సమీరుద్దీన్ పాల్గొంటున్నాడని చెప్పారు. సమీరుద్దీన్ పశ్చిమగోదావరి జిల్లాకు మూడేళ్ల నుంచి అండర్ 17కు రెండేళ్లు, అండర్ 19 టీంలకు ఒకసారి కెప్టెన్‌గా వ్యవహరించాడన్నారు. పీడీలు రామకృష్ణ, జయరాజ్, బాబూరావుల సమక్షంలో కోచింగ్ పొందినట్లు తెలిపారు. సమీరుద్దీన్ నియామకం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.
పెదవేగి: రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మ దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 86 రోజులకుగాను రూ.14,56,054 ఆదాయం లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్‌కుమార్ తెలిపారు. ఏలూరు దేవాదాయ శాఖ ఏలూరు డివిజనల్ ఇన్‌స్పెక్టర్ చల్లా ఉదయబాబు నాయుడు పర్యవేక్షించగా భక్తులు, గ్రామ పెద్దలు, ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో దేవాలయ ముఖ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించినట్లు ఈవో చెప్పారు.
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి


