నేత్రపర్వం.. సహస్ర దీపోత్సవం
నెమలి వాహనంపై కొలువైన శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరునికి హారతులిస్తున్న అర్చకులు
సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం వద్ద రోడ్డు పొడవునా అరటి బోదెలపై దీపాలు వెలిగిస్తున్న భక్తులు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన చెరువు వీధిలోని శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం స్వామివారికి లక్ష బిళ్వార్చన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, సహస్ర దీపోత్సవ వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. కార్తీక పౌర్ణమి మరుసటి రోజు ఈ వేడుకలను నిర్వహించడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. దీన్ని పురస్కరించుకుని ఆలయ సిబ్బంది ముందుగా దేవాలయాన్ని సుగందభరిత పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయ అర్చకులు, పండితులు, పురోహితులు వేద మంత్రోచ్ఛరణలతో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని, లక్ష బిళ్వాలతో అర్చనను జరిపారు. సాయంత్రం శ్రీ వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను నెమలి వాహనంపై ఉంచి పూజాధికాలను జరిపారు. ఆలయ సిబ్బంది అఖండ దీపాన్ని వెలిగించగా, ఆలయం ముందు రోడ్డు పొడవునా అరటి బోదెలపై ఏర్పాటు చేసిన దీపాలను మహిళా భక్తులు, యువతులు భక్తి ప్రపత్తులతో వెలిగించారు.
నేత్రపర్వం.. సహస్ర దీపోత్సవం


