రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఏలూరు టౌన్: ఏలూరు గిలకలగేటు ప్రాంతంలో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. పవర్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలోని గిలకలగేటు ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం ఈస్ట్‌కోస్ట్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటుందనీ, స్కై బ్లూ చొక్కా, బ్లూ ప్యాంట్ ధరించి ఉన్నాడని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కోరారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచామనీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ముదినేపల్లి రూరల్: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మండలంలోని వాడవల్లికి చెందిన మహిళ స్థానిక ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. రెండు నెలల క్రితం కై కలూరు మండలం వేమవరప్పాడుకు చెందిన నున్న శివరామకృష్ణ ఇన్‌స్ట్రాగాంలో పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇటీవల శివరామకృష్ణ గ్రామానికి వచ్చి లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


