థర్మాకోల్ షీట్ల లారీ దగ్ధం
విద్యుత్ తీగలు తగలడంతో మంటలు
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని సత్రంపాడు ఇండస్ట్రీయల్ ఎస్టేట్స్‌లో థర్మాకోల్ షీట్ల లోడుతో వెళ్తున్న లారీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లగా అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. దెందులూరులోని నాగహనుమాన్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన అశోక్ లేలాండ్ ఏపీ 39 డబ్ల్యూఏ 8772 నెంబర్ లారీలో థర్మాకోల్ షీట్ల లోడుతో ఏలూరు సత్రంపాడు ఇండస్ట్రీయల్ ఎస్టేట్స్‌లోని మారుతీ ఫిష్ ప్యాకింగ్ కంపెనీకి తరలిస్తున్నారు. లారీ మారుతీ ఫిష్ కంపెనీ ప్రాంతానికి చేరుకునే సరికి లారీ వెనుక భాగంలో విద్యుత్ తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. లారీ వెనక భాగంలో మొదలైన మంటలు పెద్దెత్తున చెలరేగి లారీ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. లారీ రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేస్తున్నారు. సుమారుగా రూ.6 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.


