అన్నదాత గోడు పట్టదా!
తూతూమంత్రంగా..
విదేశాల్లో ఆరిమిల్లి బిజీబిజీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చేతికందివచ్చిన పంట తుపాను పాలైంది. ఒకటి రెండు కాదు ఉమ్మడి పశ్చిమలో దాదాపు 50 వేల ఎకరాలకుపైగా పంట నష్టం. 2 వేల ఎకరాలకుపైగా ఆక్వాకు నష్టం వాటిల్లింది. సాగుదారులు, కౌలు రైతులు, ఉద్యానవన పంట రైతులు ఇలా వేలాది మందికి కోట్లలో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తుపాను పేరిట తారాస్థాయిలో హడావుడి అయితే చేసింది తప్ప క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు మాత్రం తుపాను నష్టం పరామర్శకు దూరంగా ఉన్నారు. కొద్ది మంది మొక్కుబడిగా అరగంట, గంట పర్యటనలు చేసి వెళ్లిపోతున్నారు. మరికొంత మంది తుపాను ఈవెంట్‌లో పాల్గొనాలని ఓ ఫొటో కార్యక్రమం మినహా క్షేత్ర స్థాయిలో తిరిగి అన్నదాతలకు తక్షణ సాయం చేయలేకపోయినా భరోసా ఇవ్వడంలోనూ పశ్చిమలోని ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారు.
గత నెల చివరి వారంలో వచ్చిన మోంథా తుపాను జిల్లాలోని అన్నదాతలను అతలాకుతలం చేసింది. ప్రధానంగా ఏలూరు జిల్లాలో 23 వేల ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 30 వేల ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది. 90 శాతానికిపైగా ఖరీఫ్ సీజన్ చివరిలో ఉన్న వరికి అపారనష్టం మిగిలింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12 వేల ఎకరాలు వరి నీటమునగగా, 18 వేల ఎకరాల్లో పంట నేలకొరిగింది. ఇక ఏలూరు జిల్లాలో 4వేల ఎకరాల పంట నీటమునగగా, 16 వేల ఎకరాలకు పైగా నేలకొరగడం, మరో 3వేల ఎకరాల్లో నీరునిలిచి పంట పాడు అవ్వటం ఇలా పూర్తి నష్టం వాటిల్లింది. ఇవి కాక ఉమ్మడి జిల్లాలో అరటి, మినుము, పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, పూలతోటలు ఇలా మరో 6 వేల ఎకరాల్లోపైగా నష్టం వాటిల్లింది. నరసాపురంలో 1500 ఎకరాల్లో రొయ్యల చెరువు గట్లు తెగి పంట కాల్వల పాలైంది. ఈ పరిణామాల క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గత నెల చివరి వారమంతా మోంథా తుపాను ఎదుర్కొంటున్నాం సమర్థ్ధవంతంగా పనిచేస్తున్నామని సోషల్ మీడియా మొదలుకొని భారీ హడావిడి చేసింది. కాని క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రజాప్రతినిధులు కనిపించకపోవడం జిల్లాలో చర్చగా మారింది.
నూజివీడు నియోజకవర్గంలో మంత్రి కొలుసు పార్థసారథి రామన్నగూడెంలో సరిగా అరగంట పరిస్థితిని పరిశీలించి వెళ్లిపోయారు. ఆ తరువాత మినుము రైతులు ఎంత నష్టపోయారు ఇలా మిగతా అంశాలన్నీ పట్టించుకోకపోవడం గమనార్హం. మరో మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గం సంగతి లైట్‌గా తీసుకుని నరసాపురంలో మాత్రం తుపాను రోజంతా హడావుడి చేసి తరువాత పట్టించుకోలేదు. కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఒక మండలంలోని గ్రామంలో గట్ల మీద నుంచి పరిశీలించి విజయవాడలో ప్రైవేటు ఫంక్షన్లు, ఇతర పనుల్లో బిజీగా ఉండిపోయారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణలు ఏదో గంట తిరగాలి కాబట్టి తిరిగేసి వెళ్ళిపోయారు. అంతకుమించి తరువాత స్థితిగతులపై నామమాత్రపు సమీక్షలు నిర్వహించకపోవడం గమనార్హం. చింతలపూడి, ఉండి, ఉంగుటూరు, భీమవరం, దెందులూరు ఎమ్మెల్యేలు కూడా అదే రీతిలో ౖపైపెన పొలాలు పరిశీలించి తుపాను ఈవెంట్ ముగించేశారు.
పొలాలకు దూరంగా కూటమి ప్రజాప్రతినిధులు
అక్కడక్కడా మొక్కుబడిగా పరామర్శలు
విదేశీ పర్యటనల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి బిజీబిజీ
నరసాపురంలో తిరగని ఎమ్మెల్యే
మంత్రులు కొలుసు, నిమ్మల కూడా మొక్కుబడి పరామర్శలు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాత్రం పూర్తిగా ప్రత్యేకం. తుపాను హడావుడి ముందు రోజు వరకు ఇతర ప్రాంతంలో ఉన్న నేత తుపాను రాగానే నియోజకవర్గానికి వచ్చారు. అలా అని పొలాలు ఏమీ చూడకుండా ఫోన్‌లో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అందరితో మాట్లాడేశానంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసి తుపాను పునరావాస కేంద్రానికి వెళ్ళి పరిశీలించి ఈవెంట్‌ను ముగించారు. పొలాల్లో తిరగడంగాని, పరామర్శలు తనకేమి సంబంధం లేదన్న రీతిలో న్యూజిలాండ్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తుపాను తీరం దాటిన ప్రాంతమైన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పొలాలు, రైతులు పరిశీలన జోలికి వెళ్ళకుండా గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి తుపాను హడావుడి ముగించేశారు. కలెక్టర్లతో ప్రజాప్రతినిధులు విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించడం, కనీసం రైతుల సాధక బాధకాలు వివరించి ప్రభుత్వానికి తెలిసేలా మాట్లాడటం ఇలాంటివేమి లేకపోవడం గమనార్హం. అధికారులు మాత్రమే యథావిధిగా 24 గంటల్లో పంట నష్టం నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపి హడావుడి ముగించారు.


