మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
నూజివీడు: రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా తెచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడటం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు. పట్టణంలోని మొఘల్ చెరువులోని లోపలి ప్రాంతంలో బుధవారం రాత్రి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ జగన్‌కు మంచి పేరు వస్తుందోనని కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. చంద్రబాబు తన పాలనలో ఏనాడైనా ఒక్క మెడికల్ కళాశాల ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. పేదవర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందదన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై ఏడాదిన్నరలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఒక్క వృద్ధుడికి నూతన పింఛన్‌ను మంజూరు చేయలేదని, ఎవరైనా వృధాప్య పింఛను తీసుకుంటూ అతను మరణిస్తే అతని భార్యకు వితంతు పింఛన్ ఇస్తున్నారే తప్ప కొత్తవి ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఈ 16 నెలలుగా రాష్ట్రంలో అప్పుల పాలన తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఏ గ్రామంలో చూసినా వీధికి నాలుగు బెల్టుషాపులు ఉంటున్నాయని, తాగి రోడ్డు వెంట పడిపోతున్న వారు గ్రామాల్లో వీధికొకరు కనిపిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, కంచర్ల లవకుమార్, క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్, కౌన్సిలర్ మీర్ అంజాద్ ఆలీ, నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు


