గోనె సంచులు సిద్ధం చేయాలి
భీమడోలు: ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు రైతులకు అవసరమైన గోనె సంచులను సిద్ధం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అన్నారు. గుండుగొలను, పూళ్ల, కురెళ్లగూడెం గ్రామాల్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. గుండుగొలనులో ఈ పంట నమోదు ప్రక్రియలో పంటను సక్రమంగా నమోదు చేసిందీ లేనిదీ ఆయన పరిశీలించారు. పూళ్ల గ్రామంలోని రైస్‌మిల్లులో గోనె సంచుల నాణ్యతను పరిశీలించి రైస్ మిల్లు యాజమాని, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. దిగుబడులను దృష్టిలో ఉంచుకుని రైతులకు తగినన్ని గోనె సంచులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కురెళ్లగూడెం ధాన్యం సేకరణ కేంద్రాన్ని సందర్శించి తేమశాతం యంత్రాన్ని పరిశీలించి రైతుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ షేక్ హాబీబ్ బాషా, ఏడీఏ పి.ఉషారాజకుమారి, తహసీల్దార్ బి.రమాదేవి, ఏవో ఉషారాణి, సర్పంచ్ గుడివాడ నాగగౌతమి, రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


