కోటి సంతకాలతో పేదలకు భవిత
మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు
నిడమర్రు: కోటి సంతకాలతో పేద విద్యార్థుల తలరాతలు ముడిపడి ఉన్నాయని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని అడవికొలనులో రచ్చబండ, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 17 మెడికల్ కళాశాల్లో చంద్రబాబు వర్గం వాటాల కోసమే ప్రైవేటీకరణ జపమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యంతోపాటు, విద్యను కూడా అందని ద్రాక్షగా మిగిల్చడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కనీసం ఆరోగ్యశ్రీ నిధులను కూడా విడుదల చేయడం లేదన్నారు. గత ప్రభుత్వంలో రూ.5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో పేదల ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సంకు సత్యకుమార్, జెడ్పీటీసీ కోడే కాశీ, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం నేత వెజ్జు వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ సమయం వీరరాఘవులు తదితరులున్నారు.


