మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులపై వినతి
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్, పెన్షనర్లకు సంబంధించి మెడికల్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ జేఏసీ నేతలు ఏలూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, ఏడీఎంఈ డాక్టర్ ఎంఎస్ రాజును కలిసి వినతి చేశారు. ఏలూరు జీజీహెచ్‌లోని ఆయన చాంబర్‌లో బుధవారం జేఏసీ నేతలు కలిసి పలు అంశాలపై ఆయనతో చర్చించారు. రూ.50 వేల లోపు మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్స్‌ను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. గత 8 నెలలుగా బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి బిల్లులు పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో జేఏసీ ఛైర్మన్, ఏపీఎన్‌జీవోస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, తాలూకా అధ్యక్షుడు జీ.శ్రీధర్‌రాజు, జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ చోడగిరి వంశీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శైలేంద్ర, ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.మహిధరాచార్యులు, దయావతమ్మ ఉన్నారు.


