 
															పచ్చనేత నిర్వాకంపై రైతుల గగ్గోలు
● ఐఎస్ జగన్నాధపురంలో నీట మునిగిన 40 ఎకరాల వరి పంట
● లబోదిబోమంటున్న బాధిత రైతులు
ద్వారకాతిరుమల: మండలంలోని ఐఎస్ జగన్నాధపురంలో ఓ టీడీపీ నాయకుడి నిర్వాకం కారణంగా చేతికొచ్చిన వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల కథనం ప్రకారం. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని ఎర్ర చెరువు పూర్తిగా నిండిపోయింది. అయితే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు గురువారం ఉదయం రైతులకు గాని, అధికారులకు గాని సమాచారం ఇవ్వకుండా చెరువు తూముకు ఉన్న గేటును ఎత్తేశాడు. దాంతో చెరువు కింద ఉన్న ఆయకట్టులో సుమారు 40 ఎకరాల వరి పంట నీట మునిగింది. విషయం తెలుసుకున్న దాదాపు 30 మంది బాధిత రైతులు తమ పొలాల వద్దకు చేరుకుని, నీటమునిగిన పంటను చూసి లబోదిబోమన్నారు. వెంటనే లాకును మూసివేసి, ద్వారకాతిరుమల తహసీల్దార్ జేవీ సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాలతో ఆర్‌ఐ సత్యం, వీఆర్వో సత్యన్నారాయణ, పంచాయతీ కార్యదర్శి సాయిరామ్ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రేపు తహసీల్దార్ వచ్చి చూస్తారని చెప్పి ఆర్‌ఐ సత్యం అక్కడి నుంచి వెళ్లిపోయారు. లాకు ఎందుకు ఎత్తావని టీడీపీ నాయకుడిని ప్రశ్నించగా, మీకు చేతనైంది చేసుకోమన్నాడని రైతులు అంటున్నారు. రెవెన్యూ అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. మరో రెండు రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పూర్తిగా నీట మునిగిందని, మొలకలు వచ్చి, పంట కుళ్లిపోతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు టీడీపీ నాయకుడు అసలు లాకు ఎందుకు ఎత్తాడో తెలియడం లేదని వాపోతున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
