 
															కలెక్టరమ్మా.. మా కన్నీళ్లు చూడమ్మా!
● కొల్లేరు ప్రజల వేడుకోలు
● మోంథా తుపానుకు మునిగిన కీలక రోడ్డు
కై కలూరు: కలెక్టరమ్మా.. మా రోడ్డు దుస్థితి చూడమ్మా.. అంటూ కై కలూరు మండలం శృంగవరప్పాడు, గుమ్మళ్లపాడు, పందిరిపల్లిగూడెం, లక్ష్మీపురం, గోకర్ణపురం ప్రజలు వేడుకున్నారు. మోంథా తుపాను దాటికి గోకర్ణపురం నుంచి పైడిచింతపాడు రోడ్డులో మూడు ప్రాంతాల్లో రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర వడ్డీ సాధికారిత కమిటీ చైర్మన్ బలే ఏసురాజు ఆధ్వర్యంలో ఐదు గ్రామాల ప్రజలు ముంపు బారిన పడిన రోడ్డును గురువారం పరిశీలించారు. పలువురు మాట్లాడుతూ గోకర్ణపురం నుంచి పైడిచింతపాడు, ప్రత్తికోళ్ళలంక, గుడివాకలంక, చాటపర్రు మీదుగా ఏలూరు పట్టణం, అదే విధంగా పైడిచింతపాడు నుంచి చెట్నెంపాడు, ఆగడాలలంక, గుండుగొలును మీదుగా ద్వారకాతిరుమల సమీపంలో హైవే వెళ్లడానికి ఈ రోడ్డు ఎంతో కీలకమన్నారు. ప్రముఖ కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం చేరడానికి ఈ రోడ్డును భక్తులు, ప్రజలు ఉపయోగిస్తారన్నారు. అటువంటిది మూడు చోట్ల నీరు రోడ్డు పైనుంచి ప్రవహిస్తుండటంతో ప్రయాణాలు నిలిచాయన్నారు. దీంతో కై కలూరు, ఉండి, ఆకివీడు మీదుగా 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందన్నారు. ఎత్తుతో రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ను కోరారు. బలే ఏసురాజు మాట్లాడుతూ ఇటీవల ఏలూరు జిల్లా కలెక్టర్‌కు రోడ్డు నిర్మాణం కోసం వినతిపత్రం అందించినట్లు తెలిపారు. అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో గమ్మళ్లపాడు సర్పంచ్ కొయ్యే గంగయ్య, ఆయా గ్రామాల పెద్దలు బలే సముద్రుడు, ఘంటసాల జగన్నాథం, రామారావు, దుర్గారావు ప్రజలు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
