 
															నేటినుంచి శోభనాచలుని బ్రహ్మోత్సవాలు
ఆగిరిపల్లి: కలియుగ వైకుంఠం.. శోభనగిరి క్షేత్రంలో శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం, కృత్తిక దీపోత్సవ కార్యక్రమాలను శుక్రవారం నుంచి ఈనెల 6వ తేదీ వరకు ఘనంగా నిర్వహించినున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సీహెచ్ సాయి, ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 9 గంటల వరకు విశేష పూజలు జరుపనున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, నవ కలశ పంచామృత స్నపన, పూర్ణహుతి, 1వ తేదీన అష్టోత్తర శత రజిత తులసీదళార్చన, నిత్య హోమం, బేరి పూజ, బేరి తాడనం, ధ్వజారోహణం, 2 వ తేదీన శ్రీవారి శోభనగిరి ప్రదక్షిణ జరుగుతుందన్నారు. 3న కొండపై స్వామివారు వెలిసిన మూడు గుళ్ల వద్ద స్వామివారికి శాంతి కల్యాణం, 4న దివ్య తిరు కల్యాణం, గరుడ వాహనోత్సవం, 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అవబృదోత్సవం, చక్రస్నానం, సాయంత్రం ఆలయం కోవెల వద్ద కృత్తికా దీపోత్సవం కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. వీటితోపాటు ప్రతిరోజు స్వామి వారికి సుప్రభాత సేవ, ఆలయ నిత్య పూజ కార్యక్రమాలు, బ్రహ్మోత్సవ విశేష పూజలు, నిత్య హోమాలు, సాయంకాలార్చనలు, నీరాజన మంత్రపుష్ప తీర్థ ప్రసాద వినియోగలను ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆలయ ఈవో సాయి తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
