నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. నిట్ విద్యా సంస్థలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో స్కిల్ స్పార్క్ 1.0 అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న వర్క్‌షాపు గురువారం ప్రారంభించారు. విభాగం అధిపతి డాక్టర్ కర్రి ఫణికృష్ణ అధ్యక్షత వహించారు. దినేష్ శంకరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్ధేశించకుని వాటి సాధనకు నిరంతరం పాటుపడాలని సూచించారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చెప్పారు. విద్యార్ధులు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను సాధించే దిశగా అడుగులు వేసి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. డీన్లు ఎన్.జయరామ్, వి.సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలపై పట్టు సాధించాలన్నారు. కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఫణికృష్ణ మాట్లాడుతూ వర్క్‌షాపులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కోఆర్డినేటర్లు డాక్టర్ శంకర్ పెద్దపాటి, తేజావతు రమేష్, డాక్టర్ కిరణ్ తీపర్తి, అల్లంశెట్టి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు.


