 
															ఏరు దాటితేనే.. బతుకు పోరు
● కోమటిలంక ప్రజల అవస్థలు
● మోంథా తుపాను ధాటికి పొంగిన డ్రెయిన్
● విద్యకు దూరమవుతున్న చిన్నారులు
కై కలూరు: ప్రభుత్వాలు మారుతోన్నా.. ఏలూరు జిల్లా కోమటిలంక ప్రజల కష్టాలు తీరడం లేదు. మోంథా తుపాను దాటికి పోల్‌రాజ్ డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కోమటిలంక గ్రామం చుట్టూ నీటితో కొల్లేరులో ద్వీపకల్పంగా ఉంటుంది. గ్రామ ప్రజల రాకపోకలకు కై కలూరు మండలం ఆటపాక పక్షుల దొడ్డి గట్టు ఒక్కటే ఆధారం. కోమటిలంక గ్రామంలో దాదాపు 110 మంది విద్యార్థులు పాఠశాల, కాలేజీ చదువులు కై కలూరులో కొనసాగిస్తున్నారు. కోమటిలంక నుంచి సమీప సరిహద్దు ఆటపాక పక్షుల విహార చెరువు గట్టు దాటడానికి మధ్యలో పోల్‌రాజ్ కాల్వ ఉంటుంది. ఇక్కడ నుంచి పడవలో ప్రజలు దాటి పక్షుల కేంద్రం గట్టుపై నుంచి ద్విచక్ర వాహనాల్లో కై కలూరు చేరతారు. ఇలా నిత్యం జరుగుతుంది. పక్షుల విహార కేంద్రం అటవీశాఖ అభయారణ్య పరిధిలో ఉండటంతో పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణానికి అటంకాలు ఏర్పడుతున్నాయి.
గర్భిణుల పాట్లు వర్ణనాతీతం
కోమటిలంక గ్రామంలో గర్భిణుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆస్పత్రికి తీసుకురావడానికి పోల్‌రాజ్ డ్రెయిన్ దాటాల్సి వస్తుంది. పూర్వం అనేక మంది తుపాను సమయాల్లో డ్రెయిన్ దాటి మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. విషపురుగులు కరిస్తే సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళ్లలేకపోతున్నారు. తక్కువ నీరు ఉన్నప్పుడు తాత్కలిక రోడ్డు ద్వారా వాహనాలతో కోమటిలంక ప్రజలు రాగలుతున్నారు. భారీ వర్షాలు, తుపాను సమయాల్లో పడవలపై దాటుతున్నారు. మోంథా తుపాను కారణంగా పోల్‌రాజ్ డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. నాలుగు రోజులుగా చిన్నారులు పాఠశాలలకు రావడం లేదు. గురువారం కై కలూరులో డిగ్రీ చదువుతున్నా విద్యార్థి అతికష్టం మీద పడవపై ప్రయాణం చేయాల్సి వచ్చింది.
మా గ్రామం నుంచి ప్రతి రోజూ డ్రెయిన్ దాటి కై కలూరు కాలేజీకి వెళుతున్నాను. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. వంతెన నిర్మించాలని ఎంతో మంది కోరుతున్నాం. గ్రామంలో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. తుపానుల సమయంలో దినదిన గండంగా బయటకు వస్తున్నాం. ఇప్పటికై నా వంతెన నిర్మించండి.
– పి.మంజు, డిగ్రీ ద్వితీయ సంవత్సర విద్యార్థి, కోమటిలంక
ఉధృతంగా ప్రవహిస్తున్న పోల్‌రాజ్ డ్రెయిన్ అవతల కోమటిలంక గ్రామం
 
							ఏరు దాటితేనే.. బతుకు పోరు
 
							ఏరు దాటితేనే.. బతుకు పోరు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
