కై కలూరు, పెదపాడుపై ప్రత్యేక దృష్టి
ఆస్తి, ప్రాణనష్ట నివారణకు చర్యలు: ఎస్పీ శివకిషోర్
ఏలూరు టౌన్: మోంఽథా తుపాను సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి, ప్రాణనష్టాన్ని సాధ్యమైనంత మేర నివారించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, ముఖ్యంగా కై కలూరు, పెదపాడు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. ఏలూరు జిల్లాలో తొలిసారిగా.. ఏలూరు డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ ఫోర్స్(ఈడీఆర్‌ఎఫ్) బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈడీఆర్‌ఎఫ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాలల్లో డ్రోన్ కెమెరాలతో నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అత్యవసర సేవలకు 112కు కాల్ చేయాలన్నారు. ఏలూరు నగరం, ఇతర ముఖ్య పట్టణాల్లో పెద్ద హోర్డింగ్‌లు వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
యజమానిదే బాధ్యత
కై కలూరు: చేపలు, రొయ్యల చెరువులపై కపాలాదారులుగా పనిచేస్తున్న కుటుంబాలకు మోంథా తుపానులో ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత చెరువుల యాజమానులే భరించాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు. కై కలూరు, కలిదిండి మండలాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఈడీఆర్‌ఎఫ్ బృందాలకు పలు సూచనలు చేశారు. జిల్లాలో కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి, నూజివీడు, పెదవేగి మండలాల్లో అత్యధిక వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఎవరూ ఇళ్లు వదిలి బయటకు రావద్దన్నారు. రోడ్లు సమీపంలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు తొలగించాలన్నారు.
నూజివీడు పెద్ద చెరువు పరిశీలన
నూజివీడు: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నూజివీడులోని పెద్దచెరువుకు వరదను ఎప్పటికప్పుడు బయటకు పంపేంలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ పేర్కొన్నారు. పట్టణంలోని పెద్దచెరువు, మొఘల్ చెరువును సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. కట్టలు బలహీనంగా ఉన్నచోట ఇసుక బస్తాలు వేయాలని, అదనంగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కనకదుర్గమ్మ ఆలయం వద్ద గృహాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంటే వెంటనే అక్కడి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వరద పెరిగినప్పుడు దిగవ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు.


