కార్తీకం.. శివోహం | - | Sakshi
Sakshi News home page

కార్తీకం.. శివోహం

Oct 28 2025 7:56 AM | Updated on Oct 28 2025 8:02 AM

వర్షాన్ని సైతం లెక్కచేయని భక్తజనం

వర్షాన్ని సైతం లెక్కచేయని భక్తజనం

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం మొదటి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వేకుజాము నుంచి భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు వేకువజాము 2 గంటల నుంచి కాలువలో స్నానాలు చేయడానికి తరలివెళ్లారు. కాలువలో కార్తీక దీపాలు వదిలి అనంతరం క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారికి అభిషేకాలు చేయించుకునే భక్తులు మహన్యాసంలో పాల్గొన్నారు. ఆలయం వెనుకభాగం, అభిషేకాల మండపం భక్తులతో నిండిపోయింది. ఆలయం నుంచి బయటకు వెళ్లే మార్గాన్ని ఉత్తరం వైపునకు ఏర్పాటుచేశారు.

యాత్రికులతో కిటకిట

మధ్యాహ్నం 11 గంటల నుంచి పంచారామ యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకుని వచ్చే భక్తులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో, అమరావతి, భీమవరం క్షేత్రాలను దర్శించుకుని వచ్చే భక్తులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలాగే పాలకొల్లు, పరిసర గ్రామాల భక్తులు ముందుగా పైనాలుగు క్షేత్రాలను దర్శించుకుని రాత్రి 8 గంటల సమయంలో క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. కార్తీకమాసం మొదటి సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆలయ అధికారులు అంచనాలు వేశారు. అయితే వాతావరణం మార్పు వల్ల అనుకున్నంత స్థాయిలో భక్తులు రాలేదు. సుమారు 15 నుంచి 20 వేల మంది వరకూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా వేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, పట్టణ సీఐ కె.రజనీకుమార్‌, పోలీసు సిబ్బంది, ఆలయ సిబ్బంది, డీఎన్నార్‌ కళాశాల విద్యార్థినులు, పలు సేవా సంస్థల సభ్యులు పాల్గొని తమ సేవలను అందించారు.

భక్తులకు తప్పని ఇబ్బందులు

ఆలయ ప్రాకార మండపం లోపల మహిళలు కార్తీకదీపాలు వెలిగించి అక్కడే కూర్చోవడంతో స్వామివారిని దర్శనానికి వెళ్లే భక్తులు నడవడానికి కూడా వీలు లేకుండా ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 8.30 గంటల నుంచి వర్షం పడడంతో క్యూలైన్లో ఉన్న భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం పక్కన ఉన్న రేపాక వారి సత్రంలో అన్నదానం ఏర్పాటు చేయగా కనీసం ఒక్క టెంట్‌ కూడా ఏర్పాటుచేయకపోవడంతో భక్తులు వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడ్డారు. కాసేపటికి నిర్వాహకులు టెంట్‌ ఏర్పాటుచేయడంతో భక్తులు ఉపశమనం పొందారు.

స్పెషల్‌ దర్శనం రూ.100కు పెంపు

క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు కొరకు ప్రత్యేక దర్శనం టికెట్‌ ధర రూ.50 ఉండేది. ఈ ధరను రాత్రికి రాత్రి రూ.100 చేయడంతో భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనిపై ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావును ప్రశ్నించగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ధర రూ.100 వరకూ పెంచుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. అయినా రూ.50, రూ.100 రెండు టికెట్లు విక్రయిస్తున్నామన్నారు. దీనిపై భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో మధ్యాహ్నం నుంచి రూ.100 దర్శనం టికెట్లు నిలిపివేసి రూ.50 మాత్రమే స్పెషల్‌ దర్శనం చేశామని వివరించారు.

మద్దిలో కార్తీకమాసోత్సవాలు

జంగారెడ్డిగూడెం: మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం క్షేత్రంలోని ఆంజనేయస్వామి వారికి ఆలయ అర్చకులు వేదపండితులు, రుత్విక్‌లు శాస్త్రోక్తంగా లక్ష తమలపాకులతో లక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.1,35,420 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. అలాగే సుమారు 3,018 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు.

పాలకొల్లు సెంట్రల్‌ : క్షీరారామలింగేశ్వరునికి అభిషేకం చేస్తున్న అర్చకస్వాములు

పాలకొల్లు సెంట్రల్‌ : క్షీరారామంలో గోశాల వద్ద కార్తీకదీపాలు వెలిగిస్తున్న మహిళలు, సాలగ్రామ దానాలు ఇస్తున్న భక్తులు

భీమవరం(ప్రకాశం చౌక్‌) : శ్రీభీమేశ్వర స్వామికి నిర్వహస్తున్న అభిషేకం

భీమవరం(ప్రకాశం చౌక్‌): కార్తీక మాసం మొదటి సోమవారం శివనామస్మరణతో భీమవరం పంచారామక్షేత్రం శ్రీఉమాసోమేశ్వరజనార్థన స్వామి వారి దేవస్థానం మార్మోగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పంచారామక్షేత్రాల యాత్రికులు, జిల్లా నలమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో స్వామి వారికి అభిషేకాలు, పూజలు, కార్తీక దీపారాధానలు, కార్తీక నోములు నోచుకున్నారు. దేవస్థానం ఆద్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.

స్వామికి ప్రత్యేక పూజలు

శ్రీఉమాసోమేశ్వర స్వామికి కార్తీక మాసం మొదటి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుంచే ప్రధాన అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాసపూర్వక రుధ్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వీరామంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి లక్షపత్రి పూజ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.రామకృష్ణంరాజు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ చింతలపాటి బంగార్‌ారజు, ధర్మకర్తలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని మరో శివక్షేత్రమైన శ్రీభీమేశ్వర స్వామి వారికి కార్తీక మాసం మొదటి సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి తోట శ్రీనివాస్‌, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

పంచారామాల్లో మార్మోగిన శివనామస్మరణ

కార్తీక సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తజనం

వేకువజామునుంచే క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు

కార్తీకం.. శివోహం 1
1/3

కార్తీకం.. శివోహం

కార్తీకం.. శివోహం 2
2/3

కార్తీకం.. శివోహం

కార్తీకం.. శివోహం 3
3/3

కార్తీకం.. శివోహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement