అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్
ఏలూరు(మెట్రో): తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అప్రమత్తంగా ఉండి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా తుపాను ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.శివ కిషోర్, జాయింటు కలెక్టర్ ఎంజే అభిషేక్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదం తగ్గే వరకు మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించాలన్నారు. సహాయక కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో టార్ఫాలిన్ సిద్ధం చేశామని రైతులకు అందజేయాలని అన్నారు. ముఖ్యమంత్రి సూచనతో పౌర సరఫరాల శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. జిలాల్లోని 583 రేషన్ షాపులలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలను సిద్ధం చేశామన్నారు. మిగిలిన రేషన్ షాపులలో రేపు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో నిల్వ చేస్తామన్నారు. రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తుపాను ప్రభావంతో పెను గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే చెప్పారు. కలెక్టరేట్‌లో తుపాను ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో కలిసి మాట్లాడారు.


