డిప్యూటీ స్పీకర్ వర్సెస్ జనసేన!
డీఎస్పీపై ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇలా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భీమవరం డీఎస్పీ జయ సూర్య కేంద్రంగా కూటమి పార్టీలో చిచ్చురేగింది. జయసూర్య తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, పేకా టను ప్రోత్సహిస్తూ ప్రైవేట్ సెటిల్‌మెంట్లు భారీగా చేస్తున్నాకని జనసేన నేతల ఫిర్యాదుల ఆధారంగా ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిన విష యం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు.. జయసూర్య మంచి ఆఫీసర్ అంటూ కితాబివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమలో పేకాట సహజమని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో డీఎస్పీ జయసూర్యపై విచారణ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ ప్రకటించారు. ఎవరైనా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, లేదంటే స్వయంగా కలిసి ఫిర్యాదు చేసినా తీసుకుంటామని చెప్పారు. అన్ని అంశాలను విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు.
ఆధిపత్య పోరేనా !
భీమవరం డీఎస్పీ వ్యవహారం రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. గతంలో భీమవరం సబ్ డివిజన్‌లో భీమవరం రూరల్, భీమవరం టూ టౌన్ సీఐగా జయసూర్య సుదీర్ఘ కాలం పనిచేశారు. ఈ క్రమంలో పేకాట క్లబ్‌లు, కోడిపందాల నిర్వాహకులు, క్రికెట్ బుకీలు, రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్ ముఠాలు.. ఇలా అన్నింటిపైనా పూర్తి అవగాహనతో పాటు వ్యక్తిగతంగా పరిచయాలున్నాయి. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ద్వారా డీఎస్పీగా భీమవరం సబ్ డివిజన్‌కు వచ్చిన జయసూర్య తొలుత భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇద్దరితోనూ, రెండు పార్టీల కేడర్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తనకున్న వ్యక్తిగత పరిచయాల ద్వారా క్లబ్ లు మొదలు కోడిపందాల వరకు అన్నింటిలో ప్ర త్యక్ష జోక్యం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో భీమవరం జూదానికి హబ్‌గా మారిందని విస్తృత ప్రచారం జరగడం, పత్రికల్లో వరుస కథనాలు రావడంతో భీమవరంలో పేకాటను కొద్దిగా కట్టడి చేసినట్లు హడావుడి చేసి వ్యవహారం సద్దుమణిగేలా చేశారు. ఇదే సమయంలో భీమవరంలో తగ్గించి ఉండి నియోజకవర్గంలో కోడిపందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగులు ఇలా అన్నింటికీ డీఎస్పీ నే గేట్లు ఎత్తారనే ఆరోపణలున్నాయి. ఈ పరిణామాల క్రమంలో కొద్ది నెలల క్రితం డీఎస్పీపై కూటమిలో ఓ వర్గం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, బదిలీ చేయించింది. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడి తేవడంతో బదిలీ నిలిచిపోయిందని ప్రచారం సాగుతోంది. దీంతో డీఎస్పీ పూర్తిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు అనుకూలంగా మారి, ఉండిలో అసాంఘిక కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో సహకరించడంతో పాటు ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి.
భీమవరం రూరల్ పరిధిలో ఓ రొయ్యల వ్యాపారికి సంబంధించి రూ.8 కోట్ల డబ్బు పంచాయితీ చేశారని ఆరోపణలు.
గతంలో సీఐగా ఉన్నప్పుడు తన వ్యక్తిగత స్నేహితుడిగా ఉన్న ఓ పేకాటరాయుడి కోసం భీమవరం–నరసాపురం మార్గంలో పేకాట శిబిరం ఏర్పాటు చేయించి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు.
భీమవరంలో కీలక క్రికెట్ బుకీ నుంచి రూ.లక్షల్లో తీసుకున్నట్లు ఆరోపణలు. జనసేన రాష్ట్ర ప్రొటోకాల్ చైర్మన్ మల్లినేని బాబి భీమవరంలో రియల్ ఎస్టేట్, బిల్డర్‌గా ఉన్నారు. బాబికి సంబంధించి ఓ సెటిల్‌మెంట్‌లో భా రీగా వసూలు చేశారని, ఓ విద్యాసంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ సెటిల్‌మెంట్‌లోనూ భారీగా వసూలు చేశారని తేలింది.
రికవరీలు బాగా చేస్తారని పేరుంది. ఆ ముసుగులో చేయాల్సింది చేసి, ట్రాక్ రికార్డు కోసం నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుంటారు. ఈ వ్యవహారాలన్నీ భీమవరంలోని ఒక సీఐ చూసుకుంటారు. ఆ సీఐ.. డీఎస్పీకి షాడోగా వ్యవహరిస్తూ.. ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉంటారనేది జనసేన నేతల ఫిర్యాదు.
కూటమిలో చిచ్చు రేపిన భీమవరం డీఎస్పీ
డీఎస్పీ జయసూర్యపై తీవ్రస్థాయిలో ఆరోపణలు
భీమవరాన్ని జూదానికి హబ్‌గా మార్చారంటూ జనసేన ఫిర్యాదు
ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆ డీఎస్పీ మంచి ఆఫీసర్ అంటూ
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కితాబు
డీఎస్పీ వ్యవహారంపై పశ్చిమ ఎస్పీ విచారణ ప్రారంభం


