అంజుమన్‌లో నిధుల గోల్‌మాల్
గోల్‌మాల్ వ్యవహారం నిగ్గు తేల్చాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో ముస్లిం సామాజికవర్గానికి సంబంధించి ప్రతిష్టాత్మక సంస్థగా అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాంకు చరిత్ర ఉంది. సంస్థ ద్వారా నగరంలో ముస్లింలకు పలురకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా క్లినిక్ నిర్వహిస్తున్నారు. అలాగే పేద ముస్లింలకు వివాహం, విద్యకు ఆర్థిక సాయం, సంప్రదాయ ఖత్నా (సున్నీ) కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థ భ్రష్టుపట్టిపోయిందని ముస్లిం పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయం ప్రతిపత్తితో కార్యక్రమాలు నిర్వహించే సంస్థలోకి రాజకీయాలను చొప్పించి ఎమ్మెల్యే, నగర మేయర్ సంస్థ నిర్వహణ విధానాలను వారి కనుసన్నల్లో చేసే పరిస్థితికి కొంతమంది సభ్యులు తీసుకువచ్చారని విమర్శిస్తున్నారు. సంస్థకు ఉన్న ఆర్థిక వనరులపై కన్నేసిన కొందరు స్వార్థపరులు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం వారి చుట్టూ తిరుగుతూ సంస్థ ప్రతిష్టను దిగజార్చుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.కోటికి పైగా..
గత ఏడేళ్లుగా సంస్థ ఆదాయం పక్కదారి పడుతోందని సభ్యులు ఆరోపిస్తున్నారు. 2024 మార్చి ముందు వరకూ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, అనంతరం వచ్చిన అధ్యక్షులు జమా ఖర్చులూ కార్యవర్గం ముందు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సంస్థ బైలా ప్రకారం ప్రతి నెలా కార్యవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా అడపదడపా మినహా సమావేశాలు నిర్వహించలేదని చెబుతున్నారు. ఆదాయానికి సంబంధించి లెక్కలు బహిర్గతం చేయాలనే కారణంతోనే సమావేశాలు నిర్వహించడం లేద ని చెబుతున్నారు. ఇలా సుమారు రూ.కోటికి పైగా ని ధులు గోల్‌మాల్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
నెలకు రూ.3.50 లక్షలకు పైగా ఆదాయం
అంజుమన్ సంస్థకు ఉన్న షాపులు, ఫంక్షన్ హాల్ అద్దెల ద్వారా నెలకు రూ.3.50 లక్షలకు పైగా ఆ దాయం వస్తుందని చెబుతున్నారు. అయితే అద్దెల రూపంలో వచ్చిన ఆదాయంలో అధిక శాతం పక్కదారి పట్టించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయానికి సంబంధించి ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో ఏడాదికి సుమారు రూ.40 లక్షలకు పైగా నిధులు దుర్వినియోగమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మూడేళ్లలో ముగ్గురు అధ్యక్షులు
సంస్థ బైలా ప్రకారం మూడేళ్లకోసారి కార్యవర్గ ఎన్నికలు నిర్వహించాలి. 2024 మార్చిలో ఎన్నికలు నిర్వహించారు. ఎండీ సలేమాన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే ఆయన నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అసమ్మతి పెట్టి ఈ ఏడాది మే నెలలో ఎండీ జబీఉల్లాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నా రు. జబీఉల్లా రెండు నెలలు పదవిలో కొనసాగగా ప్రస్తుతం ఆయన్ను దౌర్జన్యంగా తొలగించారు. ఈ నేపథ్యంలో కార్యవర్గ సమావేశం పెట్టకుండానే ఎండీ సిద్ధిక్ అలీపాషా (ఆరిఫ్) అనే వ్యక్తి తనకు మె జార్టీ సభ్యుల మద్దతు ఉందని స్వయంగా ప్రకటించుకుని అధ్యక్షుడిగా చలామణి అవుతున్నారని కొందరు కార్యవర్గ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. నిబంధనల మేరకు కార్యవర్గ సమావేశం నిర్వహించి మెజార్టీ సభ్యుల మద్దతుతో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అయితే ఇక్కడ అలాంటివేమీ జరగకుండా ఆరిఫ్ స్వయంగా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం కార్యవర్గ సభ్యులను ఆగ్రహానికి గురిచేసింది. తనకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మద్దతు ఉందని కూడా ఆరిఫ్ ప్రకటించుకోవడంతో ఎవరూ బాహటంగా వ్యతిరేకించడం లేదు.
బైలాకు విరుద్ధంగా..
గతంలో సంస్థ నిర్వహణ సక్రమంగా సాగేదని, అయితే 2024 నుంచి వచ్చిన అధ్యక్షులు సంస్థ నిధులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నా వివరాలు తెలపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కార్యవర్గ సభ్యులకు తెలియజేయకుండా బైలాకు విరుద్ధంగా ఖర్చు చేయడంతో నిధులు గోల్‌మాల్ అయ్యాయనే చర్చ వాడీవేడిగా జరుగుతోంది.
ఏలూరులో అంజుమన్ హాల్
రూ.కోటికి పైగా నిధుల స్వాహా!
మూడేళ్లలో ముగ్గురు అధ్యక్షులు
సంస్థ బైలాకు విరుద్ధంగా తీర్మానం లేకుండా ఖర్చులు
కార్యవర్గ సభ్యుల మద్దతుతో సంబంధం లేకుండా అధ్యక్ష స్థానం ఆక్రమణ
అంజుమన్ నిధులు గోల్‌మాల్ అయ్యాయని సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సంస్థ బైలా ప్రకారం ప్రతినెలా సంస్థ కార్యవర్గ సమావేశం నిర్వహించాలి. అయితే గత ఏడేళ్లలో అరకొర సమావేశాలు నిర్వహించడమే తప్ప ప్రతినెలా నిర్వహించ లేదు. నిధుల గోల్‌మాల్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధ్యక్షులు తమ హయాంలో జరిగిన ఆదాయ, వ్యయాల వివరాలు సభ్యులకు తెలపాలి. అతి తొందరగా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి సభ్యులతో చర్చలు జరపాలి.
– ఎస్‌కే మస్తాన్ బాషా, అంజుమన్ గౌరవ అధ్యక్షుడు
అంజుమన్‌లో నిధుల గోల్‌మాల్


