వర్జీనియా రైతుల నిరసన
కొయ్యలగూడెం: పొగాకు సీజన్ ముగుస్తున్నా తమ వద్ద ఉన్న బేళ్లను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని రైతులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో వేలం ప్రక్రియ నిర్వహిస్తుండగా నోబిడ్లు అధికంగా రావడం వారి నిరసనకు కారణమైంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఓ వైపు పొగాకు పంట సీజన్ ప్రారంభమైందని, పెట్టుబడుల కోసం తమ వద్ద ఉన్న పొగాకును అమ్మితే తప్ప వేరే మార్గం లేదన్నారు. వేలం కేంద్రానికి తీసుకువచ్చిన బేళ్లను కిలోకు రూ.60కు అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీల ప్రాతినిధ్యం పెరిగితే ధరలు పెరిగే అవకాశం ఉందని రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది తెలిపారు. ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలోని కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1,–2 కేంద్రాల్లో సుమారు 10 మిలియన్ కిలోల పొగాకు మిగిలి ఉందని, త్వరగా కొనుగోలు చేయాలని ఈడీకి విన్నవించినట్టు చెప్పా రు. త్వరలోనే ట్రేడర్స్‌తో సమావేశ నిర్వహించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని ఈడీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో రూ.258 కోట్లతో మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో గురువారం మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణ (ఆర్‌ఆర్‌ఆర్) పనులు, భూగర్భ జలాల పెంపు తదితర అంశాలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో మొత్తం 1,513 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా మొదటి దశలో 175 చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించామన్నారు. రెండో దశలో రూ.258 కోట్లతో 350 మైనర్ చెరువుల పనులకు ప్రతిపాదనలు సిద్ధ చేవామన్నారు. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి తుది ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
జంగారెడ్డిగూడెం: కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని నిరాకరించడంతో తయారీ కంపెనీలు ధరలు పెంచి రైతులపై భారం వేసేలా చర్యలు తీసుకుంటున్నాయని, దీంతో కాంప్లెక్స్ ఎరువులు 50 కిలోల బస్తాపై రూ.50 నుంచి రూ.100 భారం పడుతుందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఎరువుల ధరలు–రైతులపై భారం అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఎరువులపై 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించామని ప్రభుత్వం చెబుతున్నా.. ఈ పన్ను రాయితీ తయారీ కంపెనీ లకు ప్రయోజనకరంగా మారుతుందన్నారు. జీఎస్టీ ప్రయోజనం రైతులకు దక్కేలా చర్యలు తీసుకోవాలని, సబ్సిడీ కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో రైతులపై రూ.300 కోట్ల వరకు అదనపు ఎరువుల భారం పడుతుందన్నారు. సంఘం మండల కార్యదర్శి బొడ్డు రాంబాబు, మండల ఉపాధ్యక్షుడు బోడిక రామచంద్ర రావు పాల్గొన్నారు.
నరసాపురం: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పేరుపాలెం బీచ్‌లో సందర్శకుల రాకపై నిషేధాజ్ఞలు విధించారు. కార్తీకమాసం పురస్కరించుకుని బీచ్‌లోకి సందర్శకుల రద్దీ ఎక్కువయ్యింది. అయితే బీచ్ వద్ద సముద్ర అలలు ప్రమాదకరంగా ఉండటంతో స్నానాలు చేయడానికి అనుకూల పరిస్థితులు లేవు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో వేట బోట్లకు లంగరు పడింది. ఇప్పటికే సముద్రంలోకి వేట కు వెళ్లిన బోట్లను తీరానికి తరలిస్తున్నారు. అధికారులను ఆర్డీఓ దాసి రాజు అప్రమత్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. కంట్రోల్‌రూట్ ఏర్పాటు చేశారు.
వర్జీనియా రైతుల నిరసన
వర్జీనియా రైతుల నిరసన
వర్జీనియా రైతుల నిరసన


