
అమర వీరుల త్యాగాలు మరువలేం
ఏలూరు టౌన్: ప్రజల శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని.. దేశ అంతర్గత భద్రతలో కీలకపాత్ర పోషిస్తూ నిరంతరం ప్రజా సేవకే అంకితమైన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళి అర్పించారు. పోలీస్ సిబ్బంది కవాతుకు ఏఆర్ ఆర్‌ఐ సతీష్ కమాండర్‌గా వ్యవహరిస్తూ పోలీస్ అమరవీరులకు స్మృతి పరేడ్ నిర్వహించారు. అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. పోలీస్ సేవలు మరువలేనివని, ప్రపంచమంతా నిద్రపోతుంటే పోలీస్ మాత్రమే మేల్కొని శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడతారని చెప్పారు. సమాజ వ్యతిరేక శక్తులతో నిత్యం పోరాటం చేస్తూ ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో విశేష కృషి చేస్తోన్న పోలీస్‌లు రియల్ హీరోలని అభివర్ణించారు. విధుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ అందించే పరిహారం, సంక్షేమ కార్యక్రమాలు త్వరగా అందేలా కృషి చేస్తామన్నారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని 1959, అక్టోబర్ 21న ప్రారంభించారని, లడఖ్‌లో విధులు నిర్వర్తిస్తోన్న 10 మంది సీఆర్‌పీఎఫ్ జవానులను అక్రమంగా భారత భూబాగంలోకి ప్రవేశించిన చైనా దళాలు బలితీసుకున్నాయని, వారి త్యాగాలను ఏటా గుర్తు చేసుకుంటూ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సంస్మరణ దినోత్సవంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్, డీటీసీ డీఎస్పీ ప్రసాదరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఏవో మస్తాన్, వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అమర వీరుల త్యాగాలు మరువలేం

అమర వీరుల త్యాగాలు మరువలేం